చలి పంజా
విసురుతున్నది. గత పదిహేను రోజుల నుంచి విజృంభిస్తున్నది. మధ్యాహ్నం సైతం ఇగమే ఉంటుండంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. రెండు మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గడం గుబులు పుట్టిస్తున్నది. సాధ్యమైనంత మట్టుకు ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని స్పష్టం చేస్తున్నారు.
జనగామ, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. మునుపెన్నడూ లేనివిధంగా రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీనికి తోడు ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజ లు గజగజ వణికిపోతున్నారు. రాత్రిపూట మాత్రమే కాకుండా పగలంతా చలిగానే ఉండడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ఉపశమనం పొందేందుకు జనం నెగడ్లు ఏర్పాటు చేసుకొని చలిమంటలు కాగుతున్నారు.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు, వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. రైతులు, కూలీలు సైతం చలి తీవ్రతకు జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. కాగా, ఈదురు గాలులు, చలి ప్రభావం పంటలపై సైతం ఉంటుందని, దిగుబడులు తగ్గే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న తీవ్రత
డిసెంబర్ మొదటి వారం నుంచే చలి ప్రారంభం కాగా డిసెంబర్ రెండో వారంలోనే తీవ్రత అధికమైంది. ఉదయం, రాత్రి, వేకువజామున దట్టమైన పొగ మంచు కమ్ముకుంటున్నది. వారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28-25 మధ్య.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12నుంచి 10 మధ్య నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఎముకలు కొరికే చలితో పాలు, కూరగాయ ల వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక తెల్లవారుజామున ప్రయాణం చేసే వారు పొగ మంచు కారణంగా దారులు కనబడక అవస్థలు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చలి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు రక్షణ చర్యలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి పూట ఇంట్లో ఉన్న సమయంలోనూ మందపు దుస్తులు వాడాలని, సాయంత్రం ఆరు లోపే పనులు పూర్తి చేసుకోవాలని తెలుపుతున్నారు. అనంతరం బయటికివెళ్లాల్సి వస్తే శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు కప్పుకోవాలని చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు స్వెట్టర్లు, జర్కిన్లు, గ్లౌస్లు, బూట్లు ధరించాలని పేర్కొంటున్నారు. తిండి విషయంలోనూ జాగ్రత్తలు తప్పని సరని సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం త్వరగా జీర్ణం కాదని, సులువుగా అరిగే పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోవద్దని, జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటి పండ్లు ఎక్కువగా తినాలని, వీటిలో సీ విటమిన్ ఉండడం వల్ల జలుబు, ఫ్లూ వంటి అనార్యోగ్య సమస్యలు రావని సూచిస్తున్నారు. చర్మం పొడి బారకుండా వ్యాజిలెన్లు, బాడీ లోషన్లు వాడాలని, గోరు వెచ్చని నీటితో స్థానం చేయాలని చెబుతున్నారు.
వారం రోజుల ఉష్ణోగ్రతల వివరాలు
తేదీ : గరిష్ఠం : కనిష్ఠం
డిసెంబర్ 17 : 28 : 12
18 : 27 : 12
19 : 27 : 10
20 : 26 : 11
21 : 27 : 12
22 : 28 : 11
23 : 28 : 11