మారుతున్న సాంకేతిక పరిఙ్ఞాన్ని అందిపుచ్చుకునేలా ఎన్నికల కమిషన్ ఆన్‌లైన్‌లోనూ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేలా ఏర్పాటు చేసింది. ఈ మేరకు సువిధ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లో అన్ని వివరాలను నమోదు చేసి, నిర్ణీత సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరి రోజు నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మూడు సెట్ల పత్రాలు అందిస్తేనే నామినేషన్ దాఖలు చేసినట్లు భావిస్తారు.
– ములుగుటౌన్, అక్టోబర్12
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. ఎక్కడి నుంచైనా నిర్ణీత నమూనాలో SUVIDHA.ECI.GOV.IN ద్వారా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఎన్నికల నోటిఫికే షన్ వెలువడిన తర్వాత నామినేషన్ల గడువు లోపల నిర్దిష్ట విధానంలో సాధారణ నామినేషన్ తరహాలోనే ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంలో దశల వారీగా అభ్యర్థుల వివరాలు, వారి ఆస్తుల అఫిడవిట్ పత్రాలు, నిర్ధారిత నామినేషన్ డిపాజిట్, పది మంది బలపరచాల్సిన వారి వివరాలు సైతం ఇవ్వాలి. యాప్‌లో ముందుగా వచ్చిన వివరాలు నమోదు చేసిన తర్వాత వెంటనే ఇతర వివరాలు అడుగుతారు. అన్నింటిని సమర్పించిన తర్వాతనే నామినేషన్ దాఖలు చేసేందుకు ఉన్న నిర్ణీత సమయంలో స్లాట్ సమయాలను బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నేరుగా కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వివరాలతో కూడిన పత్రాలు మూడు సెట్లు అందించాల్సి ఉంటుంది. నామినేషన్ చివరి రోజులోగా వాటిని తప్పనిసరిగా అందించాలి. రిటర్నింగ్ అధికారికి నేరుగా అందిస్తేనే నామినేషన్ దాఖలు చేసినట్లుగా భావిస్తారు. తర్వాత నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు విషయంలో నేరుగా అభ్యర్థులు లేదా వారి తరపున ప్రతినిధులు హాజరు కావాల్సి ఉంటుంది.
లోటుపాట్లకు అవకాశం లేకుండా..
గతంలో దరఖాస్తు చేసేందుకు వెళ్తే నిర్ణీత పత్రాలు లేకపోతే తిరిగి పంపించేవారు. ఇప్పుడు అలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా ఆన్లైన్లో ముందస్తుగా దరఖాస్తు చేస్తే అవసరమైన పత్రాల సమాచారం అందరికీ తెలుస్తుంది. వీటన్నింటిని సిద్ధం చేసుకొని వెళ్లొచ్చు. ఆ తర్వాత రిటర్నింగ్ అధికారికి మూడు సెట్ల పత్రాలు అందించాల్సి ఉంటుంది. గతంలో నామినేషన్ పత్రాలు పూరించేందుకు అనుభవజ్ఞులను అభ్యర్థులు ఆశ్రయించేవారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానంతో విద్యావంతులు ఎవరైనా నిర్ణీత నమూనా ప్రకారం నామినేషన్లు సమర్పించొచ్చు.
కార్పొరేట్ స్థాయిలో పాలనా భవనాలు
పరకాల, అక్టోబర్ 12 : బీఆర్ఎస్ సర్కారు చొరవతో పరకాల పట్టణం అభివృద్ధి పథాన ముందుకు పోతున్నది. నాడు ఉమ్మడి పాలనలో పరకాల రెవెన్యూ డివిజన్ కల నెరవేరకపోగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. పరకాల రెవెన్యూ డివిజన్‌తో పాటు, పురపాలక సంఘం, తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలను తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో నిర్మించింది. రూ.4.8కోట్లతో మున్సిపాలిటీ భవనం, రూ.2.8కోట్లతో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, రూ.2.15కోట్లతో తహసీల్దార్ కార్యాలయాలను ఆధునిక వసతులతో నిర్మించగా, ఇటీవలే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు. పరకాల రెవెన్యూ డివిజన్ కావడంతో పాటు కార్పొరేట్ తరహా సర్కారు పాలనా భవనాలు అందుబాటులోకి రావడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.