దేవరుప్పుల/తొర్రూరు/పెద్దవంగర, మే 24 : సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని, పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందువరసలో నిలపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగరలోని పార్టీ కార్యాలయాల్లో ఆదివారం మండల, గ్రామ, బూత్ లెవల్ ఇన్చార్జిలతో డిజిటల్ సభ్యత్వ నమోదుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గతంలో పాలకుర్తి నియోజకవర్గం సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని, ఈసారి కూడా విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు. యువత, మహిళలు, రైతులు పార్టీకి మరింత దగ్గర కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్లో కార్యకర్తలే పవర్ఫుల్ అని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న శ్రేణులకు సముచిత స్థానం కల్పించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను కలిసికట్టుగా నిర్వహించడం వల్ల నియోజకవర్గంలో అనేక మంది సర్పంచులు గెలుపొందినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వాలు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా అడ్హాక్ కమిటీలుంటాయని, అనంతరం గ్రామ, మండల కమిటీలను ఎన్నుకుంటామన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు ఛీదరించుకుంటున్నారని, గడచిన కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని, రేవంత్‌రెడ్డికి ఓటేసి తప్పు చేశామన్న భావనలో వారున్నారన్నారు. రైతులు పండించిన పంటల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మక్కలు, ధాన్యం సేకరించే విషయంలో మంత్రులు ఏసీ రూముల్లో కూర్చొని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, కొనుగోలు కేంద్రాలకు వారొస్తే రైతులు ఉరికిచ్చి కొడతారన్నారు. తమ హయాంలో మంత్రులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులు తిరుగుతూ చివరి గింజ వరకు కొనుగులు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, యూరియా దొరకక, పెట్టుబడి సాయం అందక, పండించిన ధాన్యం కొనే దిక్కులేక అన్నదాత తల్లడిల్లుతున్నాడన్నారు.
కేసీఆర్ మెచ్చుకున్నరు..
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక సర్పంచ్‌లను గెలిపించిన ఘనత పాలకుర్తి నియోజకవర్గానికి, మండలంలో అత్యధిక సర్పంచ్‌లను గెలిపించిన ఘనత దేవరుప్పుల నాయకత్వానికి ఉందని ఎర్రబెల్లి అన్నారు. ఈ విషయంలో దేవరుప్పుల మండలంలో పనిచేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ప్రశంసించారన్నారు. ఇక పార్టీకోసం శ్రమించిన నాయకులకు జిల్లా, రాష్ట్ర పార్టీలో స్ధానం కలిపించేలా చూస్తానన్నారు. పాలకుర్తిలో ఎప్సుడు ఎన్నికలు పెట్టినా విజయం బీఆర్ఎస్దేనన్నారు.తాను మంత్రిగా ఉన్నప్పుడు రూ. వందల కోట్ల విలువైన పనులు మంజూరు చేశానని, ఇప్పటికీ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదన్నారు. వానకొండయ్య గుట్టపై అక్రమ మైనింగ్‌ను ఆపాలని బీఆర్ఎస్ పార్టీనే పోరాడుతున్నదన్నారు. ఆయా సమావేశాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, గ్రామ ఇన్చార్జిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.