రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున గోదాములను నిర్మిస్తున్నది. ఇందుకోసం నర్సంపేట నియోజకవర్గానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. దుగ్గొండి మండలంలోని చలపర్తిలో రూ.7.80 కోట్లతో చేపట్టిన 10 వేల టన్నుల సామర్థ్యం గల రెండు గిడ్డంగులు, నర్సంపేట మండలంలోని బాంజిపేటలో రూ.7.80 కోట్లతో చేపట్టిన 10 వేల టన్నుల సామర్థ్యం గల రెండు గిడ్డంగుల నిర్మాణం పూర్తయ్యింది. చలపర్తిలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి , ఎమ్మెల్యే పెద్ది శుక్రవారం వీటిని ప్రారంభించనున్నారు. నెక్కొండ మండలంలోని పెద్దకోర్పోలులో రూ.9.10 కోట్లు, నల్లబెల్లి మండలంలోని గుండ్లపహాడ్లో రూ.9.20 కోట్లు, అర్శనపల్లిలో రూ.5.40 కోట్లతో చేపట్టిన గోడౌన్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి.
వరంగల్, మే 11(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలా మార్చింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. ఈ క్రమంలో కరెంటు కోతలను ఎత్తేసింది. వ్యవసాయరంగానికి 24 నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నది. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులన్నింటినీ పునరుద్ధరించింది. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువుల్లోకి గోదావరి జలాలను తరలిస్తోంది. నీటి నిల్వ కోసం వాగులు, ఒర్రెలపై చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నది. పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కో ఎకరానికి రెండు విడుతల్లో రూ.10 వేల ఆర్థిక సాయా న్ని అందజేస్తున్నది. దీనికితోడు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5 లక్షల రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. రైతులు ఒకచోట కూర్చుండి చర్చించుకోవడానికి క్లస్టర్ స్థాయిలో రైతువేదికలను నిర్మించింది. విత్తనాలు, ఎరువుల కొరత తీర్చింది. కొన్ని విత్తనాలను సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తోంది. ధాన్యంతో పాటు మక్కలు, ఇతర పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది. లాభదాయకమైన పంటల సాగులో రైతులను ప్రోత్సహిస్తున్నది. ఇదే సమయంలో పంట ఉత్పత్తుల నిల్వ కోసం గోదాములను సైతం నిర్మిస్తున్నది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలో 45 వేల టన్నుల కెపాసిటీ గోదాముల నిర్మాణం చేపట్టింది. వీటిలో 20 వేల టన్నుల సామర్థ్యం గల గోదాములను రైతులకు అందుబాటులోకి కూడా తెచ్చింది. మిగిలిన 25 వేల టన్నుల కెపాసిటీతో కూడిన గోదాముల నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి కొద్ది రోజుల్లో రైతులకు అందుబాటులోకి తెచ్చే పనుల్లో అధికారులు బిజీ అయ్యారు.
భూగర్భ జలాలు పెరుగడం, వానలు సమృద్ధ్దిగా కురవడం, వేసవిలోనూ చెరువులు మత్తడి దుంకుతుండడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో పంట ఉత్పత్తుల దిగుబడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో రైతుల పంట ఉత్పత్తుల నిల్వ కోసం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో గోదాములను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గోదాముల నిర్మాణం చేపట్టేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను అధికారులు గుర్తించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చొరవతో నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టింది. తొలివిడుత రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో లేని రీతిలో ఈ నియోజకవర్గానికి గోదాముల నిర్మాణం కోసం నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా నాలుగు మండలాల్లోని ఐదు గ్రామాల వద్ద 45 వేల టన్నుల సామర్థ్యంతో కూడిన గోదాముల నిర్మాణానికి అధికారులు సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టారు. దుగ్గొండి మండలంలోని చలపర్తి వద్ద ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.7.80 కోట్లు, నర్సంపేట మండలంలోని బాంజిపేట వద్ద ఐదు ఎకరాల్లో రూ.7.80 కోట్లు, నెక్కొండ మండలంలోని పెద్దకోర్పోలు వద్ద రూ.9.10 కోట్లు, నల్లబెల్లి మండలంలోని గుండ్లపహాడ్ వద్ద రూ. 9.20 కోట్లతో పదేసి వేల టన్నుల సామర్థ్యం గల గోదాములు, ఇదే మండలంలోని అర్శనపల్లి వద్ద రూ.5.40 కోట్లలో ఐదేసి వేల టన్నుల కెపాసిటీ గల గోదాము నిర్మాణ పనులను చేపట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పలుమార్లు ఈ గ్రామాలను సందర్శించి గోదాముల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి కావడానికి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఐదు గ్రామాల వద్ద ఒక్కో గోదామును ఐదు వేల టన్ను ల సామర్థ్యం చొప్పున మొత్తం 9 గోదాముల నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. వీటిలో చలపర్తి వద్ద 10 వేల టన్నుల సామర్థ్యం గల రెండు, బాంజిపేట వద్ద 10 వేల కెపాసిటీ గల రెండు గోదాముల నిర్మాణం పూర్తయింది. ఇక్కడ గోదాములతో పాటు వేబ్రిడ్జి, పార్కింగ్ షెడ్డు, క్యాబిన్, ఆఫీసు భవనం నిర్మించి రైతుల పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు సిద్ధం చేశారు. చలపర్తిలో 10 వేల టన్నుల సామర్థ్యం గల గోదాములను శుక్రవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్దకోర్పోలులో గోదాముల రూపింగ్, ప్లాస్టింగ్, ప్రహరీ నిర్మాణం పూర్తయింది. ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. గుండ్లపహాడ్లో ఓ గోదాము నిర్మాణం పూర్తికాగా.. మరో గోదాము పను లు తుది దశలో ఉన్నాయి. వేబ్రిడ్జి, క్యాబిన్, పార్కింగ్ షెడ్డు, ఆఫీస్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అర్శనపల్లిలో ఐదు వేల టన్నుల సామర్థ్యం గల గోదా ము నిర్మాణం పూర్తి చేసిన అధికారులు వసతులను కల్పించే పనులు చేస్తున్నారు. మరి కొద్దిరోజుల్లో పెద్దకోర్పోలు, గుండ్లపహాడ్, అర్శనపల్లి గోదాముల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని గిడ్డంగుల సంస్థ అధికారులు తెలిపారు. 2002లో వరంగల్ ఎనుమాముల వద్ద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కేవలం 12,500 టన్నుల కెపాసిటీ గల గోదాముల నిర్మాణం మాత్రమే జరిగింది. రాష్ట్రం ఆవిర్భవించాక గత ఏడాది నుంచి ప్రభుత్వం కొత్తగా 45 వేల టన్నుల కెపాసిటీ గోదాముల నిర్మాణం చేపట్టడం గమనార్హం. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోనే కాకుండా ఇతర శాఖల ఆధ్వర్యంలో కూడా నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గోదాముల నిర్మాణం జరుగుతోంది.