హసన్‌పర్తి, మార్చి 3 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటేనే తగ్గించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్ ఆధ్వర్యంలో హసన్‌పర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు అడ్డగోలుగా ష్ట్రాపెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం ఉందన్నారు. కేంద్రం అసమర్థ విధానాలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, జడ్పీటీసీ సునీత, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు నరెడ్ల శ్రీధర్, పావుశెట్టి శ్రీధర్, జంగ కుమార్‌యాదవ్, పిట్టల కుమారస్వామి పాల్గొన్నారు.
‘మోదీకి ప్రజలే గుణపాఠం చెబుతారు’
మోడీ ప్రభుత్వానికే ప్రజలే గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. కేంద్రం వంట గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనగా మండల కేంద్రంలో చేపట్టిన ధర్నా, వంటావార్పులో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర సరుకుల రేట్లు పెంచుతోందన్నారు. మోదీ నడ్డి విరుస్తూ బడా దోస్తులకు దేశ సంపదను దోచిపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధరలను ఎనిమిదేళ్లలో 270 శాతం పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందున్నారు. కాగా, మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు రూ.53లక్షల 6వేల 148 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, తహసీల్దార్ రాజేశ్ పాల్గొన్నారు.