వరంగల్ చౌరస్తా, నవంబర్ 4 : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది తీరుపై రోగులు మండిపడుతున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అ నంతరం డాక్టర్లు ఎప్పుడు వస్తారో.. తమను పరీక్షిస్తారో అని గంటల తరబడి వేచిచూస్తున్నారు. నిలబడే ఓపిక లేక అక్కడే చతికిలపడుతున్నారు. అవసరానికి తగినంత మంది వైద్యులు లేరు.. ఉన్నా రారు… వచ్చినా సమయ పాలన పాటించరు.. ఇదీ ఇక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి.
పది రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు రోజు మార్చి రోజు చొప్పున అధికారులు షెడ్యూల్ తయారు చేశారు. అందులో భాగంగా సోమవారం, బుధవారం కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ సేవలు అం దిస్తుండగా, శుక్రవారం ఓపీ రివ్యూ డే ఉంటుంది. అలాగే మంగళ, గురువారాల్లో న్యూ రాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ సేవలందిస్తూ శనివారం రివ్యూ చూస్తున్నారు. అయితే సోమ, మంగళవారాలు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ బాధితులతో ఓపీ రద్దీగా ఉంటుంది.
రోగ నిర్థారణ కో సం ఇక్కడ కేవలం శాంపిల్స్ తీసుకొని పరీక్షల కోసం ఎంజీఎంహెచ్కు తరలిస్తున్నారు. దీంతో రోగులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాంపిల్స్‌ను ఎంజీఎంహెచ్కు తరలించే బదు లు రసాయనాలను హాస్పిటల్లో అందుబాటులో ఉంచి పరీక్షలు నిర్వహించాలని రోగులు వాదిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని, తమ కష్టాలను తీర్చాలని రోగులు కోరుతున్నారు.