ఎల్కతుర్తి, ఏప్రిల్ 15 : ఉద్యమ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడి రాష్ర్టాన్ని సాధించారని.. ఈ ప్రాంత అభివృద్ధి, సంక్షేమంపై ఆయనకు ఉన్న తపన మరే నాయకునికీ, పార్టీకీ ఉండదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధిస్తామని చెప్పి చేసి చూపించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని.. తెలంగాణ వెనకబడి ఉన్న ప్రాంతమన్న అభిప్రాయం ఉండేదని, కానీ పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ అభివృద్ధి చేసుకోవచ్చని రుజువు చేశారని కొనియాడారు. దురదృష్టవశాత్తు పార్టీలు గెలుస్తాయి, ఓడుతాయని, కానీ ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా గుర్తు పెట్టుకుంటారని వివరించారు.
ఎల్కతుర్తిలో జరుగుతున్న సభ ఏర్పాట్లను, వేదిక పనులను మంగళవారం ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలుస్తుందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత పదేండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధితో బ్రహ్మాండమైన పరిపాలన అందించారని పేర్కొన్నారు. 27న జరగబోయే బహిరంగ సభకు ప్రజల నుంచి స్పందన చాలా బాగున్నదన్నారు. స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. సభకు వచ్చే వాహనాలకు సైతం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు నిత్యం దగ్గరుండి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని సభ కోసం భూములు ఇచ్చిన స్థానిక రైతులకు ధన్యవాదాలు చెప్తున్నట్లు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్, నాయకులు మండల సురేందర్, ఎల్తూరి స్వామి, కడారి రాజు, తంగెడ నగేశ్, తంగెడ మహేందర్, శ్రీకాంత్‌యాదవ్, చదిరం నగేశ్, కోరె రాజుకుమార్, ఎండీ మదార్, పాటి భగవాన్, రాజేశ్వర్‌రావు, గుండేటి సతీశ్ పాల్గొన్నారు.
500మంది కూర్చునేలా సభావేదిక
ఎల్కతుర్తిలో బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. సభా వేదికను కేసీఆర్ సూచనల మేరకు 500మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాటు చేస్తున్నాం. సభా ప్రాంగణం, పార్కింగ్ కోసం ఇప్పటికే 1200 ఎకరాలు సేకరించాం. వరంగల్-సిద్దిపేట-కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలకు ఆయా రూట్లలో పార్కింగ్ స్థలాలను గుర్తించాం.
ఆయా ప్రాంతాల నాయకులు వచ్చి ముందుగానే పార్కింగ్ స్థలాలను చూసుకుని వెళ్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సైతం చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షలాది మంది సభకు వస్తారు. వారందరికీ అన్ని వసతులను కల్పిస్తున్నాం. సభ నిర్వహణ కోసం భూములు ఇచ్చిన చింతలపల్లి, ఎల్కతుర్తి గ్రామాల రైతులకు పార్టీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు.
– వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే