ఖిలావరంగల్, జూలై 8: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో 118 దరఖాస్తులు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలపై సత్యశారదకు వినతిపత్రాలు అందజేశారు.రెవెన్యూశాఖకు చెందినవే అత్యధికంగా 76 వచ్చాయి. పైడిపల్లి, కొత్తపేట శివారులో పేదలు వేసుకున్న గుడిసెలను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది కూల్చేయగా 2,700 కుటుంబాలు రోడ్డున పడ్డారని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ధరణిలో నమోదై, రైతుబంధు డబ్బులు వస్తున్న తన 19గుంటల భూమిని కొందరు వెంచర్ పేరుతో కాజేశారని ఖిలావరంగల్‌కు చెందిన దివ్యాంగుడు మధూకర్ వీల్‌చైర్‌పై వచ్చి వినతిపత్రం ఇచ్చారు. ఖానాపూర్ మండలానికి చెందిన వృద్ధురాలు పుల్ల యాకమ్మ తన భూమిని బంధువులు కబ్జా చేశారని విన్నవించారు. భర్త ఆరు ఫీట్ల దారితో 3.02 ఎకరాలు కొనుగోలు చేయగా, తమ పక్కనున్న భూమిని కొనుగోలు చేసిన తాళ్లపెల్లి చంద్రశేఖర్, శ్రీనివాస్ వ్యవసాయ భూమికి వెళ్లే దారిని కబ్జా చేయడంతోపాటు గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టారని వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన మంచోజు రాజేశ్వరి ఫిర్యాదు చేసింది. ఓంకార్ స్వీట్ సోంపు వక్కపొడి కంపెనీలో పనిచేస్తున్న తన భర్త రాజయ్యపై గత ఏడాది మే నెలలో ప్రమాదవశాత్తు డబ్బాలు మీదపడి తీవ్రంగా గాయపడ్డాడని, అదే రోజు కంపెనీ బాధ్యులు దవాఖానకు తీసుకువెళ్లారని, మూడు నెలల తర్వాత గాయాలు సెప్టిక్ కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందినప్పటికీ కంపెనీ బాధ్యులు నష్ట పరిహారం ఇవ్వడం లేదని, పోలీస్ కేసు పెట్టినా, లేబర్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని ఇండ్ల యాకలక్ష్మి ఫిర్యాదులో తెలిపారు. వస్తున్న భూమిని సోదరుడు చేశాడని రాయపర్తి మండలం కొలన్పల్లికి చెందిన ఎం.దేవేందర్ ఫిర్యాదు చేశాడు. గేదెల కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూరైన రుణం ఇవ్వాలని పర్వతగిరి మండలం వడ్లకొండకు చెందిన వల్లందాస్ ఎల్లయ్య వినతిపత్రం సమర్పించారు. జాతీయ స్థాయి ఇన్స్ఫైర్కు ఎంపికైన నెక్కొండ మండలం జడ్పీ స్కూల్ విద్యార్థి నిఖిల్‌ను కలెక్టర్ అభినందించి, శాలువాతో సత్కరించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరించిన వినతులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఈవో వాసంతి, డీఆర్డీవో కౌసల్యాదేవి, జడ్పీ సీఈవో రాంరెడ్డి పాల్గొన్నారు.
ఖిలావరంగల్: వన మహోత్సవంలో భాగంగా నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎఫ్‌వో అనుజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా ఈ ఏడాది నాటాల్సిన మొకలకు సంబంధించి శాఖలవారీగా లక్ష్యాలను గుర్తుచేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వానకాలం ప్రారంభమైనందున మొకలు విరివిగా నాటాలని సూచించారు అనువైన స్థలాలను గుర్తించి మొకలు నాటడంతోపాటు జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాకు 25,58,317 మొకలు నాటే లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వన మహోత్సవం ప్రగతిపై రోజువారీగా నివేదికలు సమర్పించడంతోపాటు వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. డీఆర్డీవో కౌసల్యాదేవి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, డీఎంహెచ్‌వో ఓ డాక్టర్ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికుల వేతనాలను పెంచాలని ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి సుంచు జగదీష్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టర్‌కు ఏఐసీటీయూ ఆధ్వర్యంలో పలువురు నాయకులు వినతిపత్రాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలో వివిధ కేటగిరిలో పనిచేస్తున్న 13మంది ఎన్ఎంఆర్ కార్మికుల జీతాలు పెంచాలన్నారు. సర్క్యూలర్ ప్రకారం వేతనాలు పెంచాలని పదే పదే అడిగినా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని తెలిపారు. తక్షణమే ఎన్ఎంఆర్ కార్మికుల వేతనాలు పెంచి, సకాలంలో జీతాలు అందించాలని కోరారు. జిల్లా కార్యదర్శి జన్ను రమేశ్, రాగినేని ఐలయ్య ఉన్నారు.