పోచమ్మమైదాన్, జనవరి 3: మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మైనార్టీ గురుకులాల్లో విద్యార్థుల అడ్మిషన్ల కోసం వరంగల్ 13వ డివిజన్లోని ఎంహెచ్‌నగర్, నజ్రత్పురం, వీవర్స్‌కాలనీ, లెనిన్‌నగర్‌లో మంగళవారం విస్తృత ప్రచా రం నిర్వహించారు. కార్పొరేటర్ సురేశ్కుమార్జోషితో కలిసి తెలంగాణ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీల రీజినల్ లెవల్ కో ఆర్డినేటర్ బల్గూరి శ్రీపాల, ప్రిన్సిపాల్స్ దాసరి కృష్ణకుమారి, మాధవి, జక్కలొద్ది బాలుర మైనార్టీ స్కూల్, కాలేజీ ప్రిన్సిపాల్ భిక్షపతి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు.
మైనార్టీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. ప్రభుత్వం ఉచిత విద్యతోపాటు వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నదని తెలిపారు. మైనార్టీ విద్యార్థులను కళాశాలలో చేర్పిం చి, విద్యార్థుల భవిష్యత్‌కు తోడ్పాటు అందించాలని సూచించారు. అలాగే, దేశాయిపేటలో మైనా ర్టీ బాలికల గురుకుల భవన నిర్మాణ పనులను వారు పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి.