వరంగల్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఏమి మారెను..ఏమీ మారెనురా’ అంటే రేవంత్ సర్కార్ పుణ్యమా అని ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నింటా తిరోగమనంలో పయనిస్తున్నది. స్థూల ఉత్పత్తి, తలసరి ఆదా యం రెండింట్లోనూ చివరాఖరు స్థానం చే జిక్కించుకొని ప్రగతిలో పాతాళానికి జారిపోతున్నామని రాష్ట్ర శాసనసభకు సమర్పించిన ‘తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్-2026 స్పష్టం చేస్తున్నది. ప్రజాప్రతినిధులు పలికే ప్రగతి పలుకులకు, క్షేత్రస్థాయిలో ఉన్నా వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఏమిటో ప్రభుత్వం విడుదల చేసిన ఆ నివేదిక చెప్తున్నది. బీఆర్ఎస్ హ యాం లో పురోగమించిన ప్రగతికి, ప్రస్తుతం కాం గ్రెస్ సర్కార్ హయాంలో తిరోగమిస్తున్న పరిణామాలను ఆ నివేదిక కండ్ల ముం దుంచింది. పాలకులు, నేతలు ఉపన్యాసాలు ఎంత దంచినా, ఈస్ట్‌మన్ కలర్లో ఎన్ని సినిమాలు చూపినా ఒక దేశం, రాష్ట్రం, ఒక జిల్లా లేదా ఒక ప్రాంతం నిన్నటి కన్నా నేడు మెరుగుపడిందా? లేదా? అని కొలిచే ప్రమాణాలే స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయాలు.
దిగజారుతున్న ప్రగతి
రాష్ట్ర స్థితిగతులు తెలిపే సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ జిల్లాల ఆర్థిక ముఖ చిత్రాన్ని బట్టబయ లు చేసింది. విస్తృతమైన సహజ, మానవ వనరులున్న జిల్లాలు పురోగమించాల్సింది పోయి నానాటికి దిగజారుతున్నాయని సర్కార్ విడుదల చేసిన నివేదికే తేల్చిచెప్తున్నది. అయితే, కేసీఆర్ హయాం లో సాధించిన పురోగతి స్థాయి నుంచి బ్రేక్ చేయకపోయినా, ఆ స్థితి అయినా కొనసాగకుండా మ రింత కిందికి దిగజారడం ఆందోళన కలిగించే అంశ మే అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్య అంతరం రెండేండ్లే. అయితే, ఈ రెండేండ్లలో భారీగా పురోగమించకపోయినా ఉన్నస్థానంలో అయినా ఉండాలి కానీ, దిగజారుతున్నా యి. జిల్లాల స్థూలఉత్పత్తిలో, తలసరి ఆదాయం లో అదే తేడా కనిపిస్తున్నదని వివరిస్తున్నారు. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీడీపీ)లో ఒక్క జనగా మ జిల్లా ర్యాంకు మాత్రమే మెరుగు పడగా, తక్కిన జిల్లాలు వెనక్కి మళ్లుతున్న సంకేతాలను ఆ నివేదిక స్పష్టం చేసింది. తలసరి ఆదాయానిదీ అదే వరుస అన్నట్టుగా నివేదిక స్పష్టం చేస్తున్నది.
రెండు చివర్లు మనవే
జీడీడీపీ, తలసరి ఆదాయంలో ఆఖరి స్థానం మన జిల్లాలే దక్కించుకున్నాయి. ఒక్క తలసరి ఆదాయం విషయంలో ములుగు జిల్లా టాప్ టెన్ (రాష్ట్రంలో 7వ స్థానం) జిల్లాల జాబితాలో ఉంటే జీడీడీపీలో నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పాలనలో తన చివరిస్థానాన్ని కొనసాగిస్తుండగా తలసరి ఆదాయంలో హనుమకొండ జిల్లా ఆఖరిస్థానాన్ని ఆక్రమించుకోవటం గమనార్హం. ఇక తలసరి ఆదాయంలో 12వ స్థానం లో జయశంకర్-భూపాలపల్లి, 17వ స్థానంలో వరంగల్, 20వ స్థానంలో జనగామ, 29వ స్థానంలో మహబూబాబాద్ జిల్లాలున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ సర్కార్ హయాంలో మన జిల్లాల్లోని మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరు గొప్పలు బారెడు.. చేతలు చారెడు అన్నట్టుగా ఉందని సర్కారు విడుదల చేసిన గణాంకాలే చెప్తుండడం గమనార్హం.
