గిర్మాజీపేట, ఆగస్టు 21 : ‘నాకు మరోమారు తూర్పు నియోజకవర్గం తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే అభ్యర్థిగా నన్నపునేని నరేందర్‌ను ప్రకటించడంతో సోమవారం శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో సంబురాలు అంబరాన్నంటాయి. మొదట ఎమ్మెల్యే నరేందర్ సతీమణి వాణి ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నరేందర్‌ను కార్యకర్తలు భుజాన ఎత్తుకొని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా మంత్రులు, నియోజకవర్గ నాయకులు, చైర్మన్లు, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక సామన్యుడైన తనకు అర్బన్ అధ్యక్షుడిగా, మేయర్‌గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు జన్మతా రుణపడి ఉంటానన్నారు. వరంగల్ తూర్పు ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోమారు ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో ముందుంచుతానని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని.. మళ్లీ అధికారం బీఆర్ఎస్దేనని.. తూర్పులో గులాబీ జెండా ఎగురవేద్దామని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి విజయం సాధించాలన్నారు.