జనగామ, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : జనగామలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూష పర్వతాలును ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు హైదరాబాద్ క్యాంపునకు తరలిస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు రౌడీషీటర్ల సాయంతో భువనగిరి బైపాస్ రోడ్డులోని ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ వద్ద అడ్డుకొని కిడ్నాప్‌నకు యత్నించా రు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పోలీసు బలగాలతో అక్కడ మోహరించి, స్వతంత్ర అభ్యర్థిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పల్లా హుటాహుటిన అక్కడికి చేరుకొని స్వతంత్ర అభ్యర్థిని విడిపించేందుకు యత్నించారు.
అయితే పోలీసులు ఎమ్మెల్యేను ఎంపీ, విప్ ఉన్న హోటల్ ప్రాంగణానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై భువనగిరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోపక్క ఇదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌కు మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ జనగామలోని ఆయన నివాసం వద్ద వార్డు ప్రజలు, ఆయన అనుచరులు నిరసనకు దిగడం, ఫోన్లు చేసి హెచ్చరించడంతో పర్వతాలు ఒత్తిడి గురయ్యారు. దాదాపు అరగంటకుపైగా హైడ్రామా అనంతరం పోలీసు అధికారులు వచ్చి అభ్యర్థి అంగీకరిస్తే వెంట పంపిస్తామని ఒప్పించి ఎమ్మెల్యేను లోపలికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే పల్లాను చూసి వెంట వచ్చేందుకు పర్వతాలు ఒప్పుకోవడంతో హైదరాబాద్‌కు తరలించారు.