మహబూబాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) / హనుమకొండ : గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాను చలి వణికిస్తున్నది. నవంబర్లోనే పంజా విసురుతున్నది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10-15 డిగ్రీల సెల్సియస్ మేరకు పడిపోయాయి. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సాధారణంగా డిసెంబర్లో అధికంగా ఉండే చలి గతంలో ఎన్న డూ లేని విధంగా ఈసారి ప్రారంభంలోనే గజ గజలాడిస్తున్నది.
గత వారం రోజులు గా పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు తోడు పొద్దంతా చలి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రజలు పనుల నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో స్వెటర్లు, జర్కిన్లు, మఫ్లర్లు వినియోగిస్తున్నారు. చిన్నారు లు తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా, వృద్ధులు రగ్గులు, దుప్పట్లను ఆశ్రయిస్తూ ఇంటి నుంచి బయటకు రావడం లేదు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులతో పాటు ప్రధానంగా అలర్జీ, బీపీ, గుండె, అస్తమా, శ్వాసకోస సంబంధ వ్యాధులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటురు. చలికాలంలో దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, ఊపిరితిత్తుల సమస్య, తుమ్ములు వస్తాయని, చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి నిమోనియా బారిన పడే అవకాశలుంటాయని, గాలి ద్వారా సూక్ష్మ జీవులు శరీరంలోకి ప్రవేశించడంతో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, సరైన జాగ్రత్తలతోనే వీటి బారిన పడకుండా ఉంటామని పేర్కొంటున్నారు.

తగ్గిన ఉష్ణోగ్రతలు
సోమవారం ములుగు జిల్లాలో 11.2 డిగ్రీలు, జనగామలో 11.4, వరంగల్‌లో 11.5, జయశంకర్ భూపాలపల్లిలో 11.6, హనుమకొండలో 11.8, మహబూబాబాద్‌లో 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10.2 డిగ్రీలు, హనుమకొండలో 10.7, ములుగులో 11, జనగామలో 11.5, వరంగల్‌లో 12, మహబూబాబాద్‌లో 12.6 డిగ్రీలు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.