కరీమాబాద్, నవంబర్ 19 : రోజు రోజుకు పెరుగుతున్న చలి బారి నుం చి తప్పించుకునేందుకు ప్రజలు స్వెటర్లను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు. వరంగల్ నగరంతో పాటు ఆయా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ఇప్పటికే వ్యాపారులు గుడారాలు వేసుకొని అమ్మకాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో ఉండే చలి తీవ్రత ఈసారి నవంబర్లోనే ఉండడంతో ఈసారి స్వెటర్ల వ్యాపారం జోరందుకున్నది.
నగరంలోని పలువురు వ్యాపారులు దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి వెచ్చని స్వెటర్లు దిగుమతి చేసుకొని అమ్మకాలు జరుపుతున్నారు. అలాగే పలు రాష్ర్టాలకు చెందిన వారు సైతం ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నాణ్యతతో పాటు సరికొత్త డిజైన్లతో నాలుగు నెలల పాటు వీటి అమ్మకాలు సాగిస్తుంటారు. ఏటా బతుకుదెరువు కోసం వందలాది మంది గుడారాల్లో ఉంటూ స్వెటర్లతో పా టు గ్లౌజ్‌లు, సాక్స్‌లు, మంకీ క్యాప్‌లు, మఫ్లర్లు అమ్ముతుంటారు. సుమా రు పాతికేళ్లుగా స్వెటర్ అమ్మకందారులకు వరంగల్ జిల్లాతో అనుబంధం కొనసాగుతున్నది. అక్టోబర్ చివరివారం నుంచి జనవరి వరకు అమ్మకాలు సాగిస్తుంటారు. పెరుగుతున్న పోటీకి అనుగుణంగా వ్యాపారులు ప్రత్యేకతను చాటుతూ సరుకును విక్రయిస్తున్నారు. నాణ్యతతో పాటుగా ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
ఫిక్స్డ్ రేట్లు..
ఇప్పటికే స్వెటర్ల అమ్మకాల కోసం నిర్వాహకులు సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి సరుకును దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్మకాలు చేపడుతున్నారు. కర్ణాటక, రాజస్థాన్, నేపాల్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో సరుకును తీసుకొస్తున్నారు. గతంలో నేపాల్ వ్యాపారులు ఎక్కువగా ఆసక్తి చూపగా, కాలక్రమేణా దేశంలోని ఇతర రాష్ట్రాల వారు సైతం ఇక్కడ స్వెట్టర్ల వ్యాపారం చేస్తున్నారు. గతంలో ధరల విషయంలో బేరసారాలుండగా, ఇప్పుడు ఫిక్స్డ్ రేట్‌కు సంబంధించిన టాగ్‌ను అతికించి అమ్మకాలు సాగిస్తున్నారు. సరుకు నాణ్యత, సైజులను బట్టి ధరలను నిర్ణయిస్తున్నారు. వరంగల్ నగరం ఏటా బతుకుదెరువు కోసం వచ్చే స్వెటర్ వ్యాపారులకు మంచి మార్కెట్‌గా మారింది.