పోచమ్మమైదాన్, డిసెంబర్ 8 : రా్రష్ట్ర రాజధాని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా, అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తూ, రాజకీయాలకతీతంగా ఉండాల్సిన విగ్రహాన్ని మార్పులు చేయడమేమిటి? పార్టీలు మారినప్పుడల్లా ఇలా తెలంగాణ తల్లి ఆనవాళ్లను మార్చుకుంటూ పోతే ఎంతో మంది కష్టపడి, ప్రాణాలను తెగించి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ర్టానికి ఏం విలువ ఉంటుంది. తొలి, మలి దశ ఉద్యమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో ఆరాధించే బతుకమ్మ ఫొటో లేకపోవడం, అధికార పార్టీకి ఎన్నికల చిహ్నంగా ఉన్న హస్తంను చూపించడం, సాధారణ మహిళగా కనిపించడంపై తెలంగాణ ప్రజలను నిరుత్సాహానికి గురిచేస్తుంది’ అని పలువురు సాహితీ వేత్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
కేసీఆర్ ఆనవాళ్లను అంతమొందించాలని పనిగట్టుకుని రూపుమాపే ప్రయత్నం. ఇది ముమ్మాటికీ పిల్లల చేష్టగా ఉంది. విగ్రహం రూపురేఖలు అసమగ్రంగా ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన అనేక ప్రజాహిత కార్యక్రమాలను విడిచిపెట్టి పాలకులు ఈ ఆకతాయి చేష్టలు చేస్తున్నారు. ఇందుకు ప్రజాధనాన్ని వెచ్చిస్తూ సమయాన్ని వృథా చేయడం క్షమించరాని దుశ్చర్య.
– రామా చంద్రమౌళి, ప్రముఖ కవి, రచయిత
ప్రస్తుత ముఖ్యమంత్రి ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు సామాన్య ముత్తయిదువలా ఉంది. ఇది ఎవరూ సహించరు. ఇలా తయారు చేయడం వారి విజ్ఞాన పతనానికి నాంది. తెలంగాణ తల్లి ఒక దేవతలా ఉండాలి. పూజనీయురాలిగా కనపడాలి. విగ్రహ మార్పును ప్రజలు వ్యతిరేకించాలి. ఇలా చూస్తుంటే భారతమాత విగ్రహాన్ని కూడా మార్చేలాగున్నారు. రేపు రాజశాసనం కూడా మార్చితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
– కాజీపేట తిరుమలయ్య, జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు
తెలంగాణ తల్లి విగ్రహంలో పార్టీ గుర్తు కనపడేవిధంగా ఉండకూడదు. రాజ్యాంగబద్ధంగా ఉండాలి. విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రజల నుంచి విమర్శలు రాకూడదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినట్లు రేపు తెలంగాణ గీతం మార్చబడవచ్చు. అయితే అందెశ్రీ ఉద్యమగీతం మాదిరిగానే తాను రాష్ట్రగీతం రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.
-మహమ్మద్ సిరాజుద్దీన్, ప్రముఖ కవి
తొలిదశ, మలిదశ ఉద్యమంలో బతుకులను ఆరాధించే బతుకమ్మలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించామని కాళోజీ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడం వెలితిగా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా బతుకమ్మ లేదని, పక్కన ఉన్న ఆంధ్రలో కూడా బతుకమ్మ ఆట ఆడరని అన్నారు.
కాళోజీ కవితల్లో బతుకమ్మ విశిష్టతను చెప్పారని గుర్తు చేశారు. మాతృత్వం అందించిన తల్లిలా, దేవతలా చూసుకోవాలని గాని, కొత్త విగ్రహంలో ఆ భావన కలగడం లేదని ప్రముఖ కవి సారంగం అన్నారు. జన్మభూమిశ్చ అనేది సామెత. అయితే తెలంగాణలో పుట్టిన వారికి ఆ విగ్రహం తెలంగాణ మూలాలు అందించడం లేదని పేర్కొన్నారు. విగ్రహ ముఖ్యం కాదు. ఆ తెలంగాణ మన తల్లి తన పిల్లలను ఆకలి దప్పులు లేకుండా తీరుస్తుందని ప్రముఖ కవి పల్లేరు వీరస్వామి అన్నారు.
విగ్రహాలను పెట్టడం, మార్చడం కాదూ, ప్రజా సమస్యపైన ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రముఖ రచయిత అనిశెట్టి రజిత అన్నారు.ప్రజల కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని, ప్రభుత్వం ఏ పార్టీకి చెందినప్పటికీ ప్రజల ఇబ్బందులు తీర్చడమే మొదటి కర్తవ్యంగా ఉండాలని పేర్కొ న్నారు. బతుకమ్మలు, పోచమ్మలు తెలంగాణకు ప్రత్యేక సంస్కృతిగా ఉంది అని, విగ్రహంలో బతుకమ్మ బొమ్మ తీసేయడం నచ్చలేదని ప్రముఖ రచయిత మమత తెలిపారు. అలాగే కిరీటాలు ఎందుకు తీశారో తెలియదు. ఒక మార్పు కోసం మూలం మర్చిపోయారేమోనని పేర్కొన్నారు.