యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. రెండు జిల్లాల్లో ఈ సారి రికార్డు స్థాయిలో వడ్లు సేకరించారు. హనుమకొండ జిల్లాలో 163 సెంటర్ల ద్వారా 1.30 లక్షల టన్నులు, వరంగల్ జిల్లాలో 192 కేంద్రాల్లో 1.45 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం 56,651 మందికి లబ్ధి చేకూరగా, రైతుల ఖాతాల్లో పూర్తిగా డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. తడిసిన ధాన్యానికీ మద్దతు ధర చెల్లించామని, యాసంగిలో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొనడం ఇదే ఫస్ట్‌టైం అని తెలిపారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు రైస్ మిల్లులకు తరలించారు. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనడంతో రైతులు హర్షం వెలిబుచ్చుతున్నారు.
వరంగల్, జూన్ 25(నమస్తేతెలంగాణ) : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని సేకరించింది. మద్దతు ధర ప్రకారం దీని విలువ రూ.297.52 కోట్లు కాగా 28,996 మంది రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా ఆవిర్భావం నుంచి ఇంత పెద్ద మొత్తంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరగడం ఇదే తొలిసారి. వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, కాళేశ్వరం నీటితో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. ప్రభుత్వ విధానాలతో యాసంగిలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఆయా చెరు వుల కింద నిర్దేశిత ఆయకట్టు నూరు శాతం సాగులోకి వస్తున్నది. ఈ ఏడాది జిల్లాలో పాకాల వంటి చెరువుల కింద ఉన్న ఆయకట్టులో రైతులు వంద శాతం వరి పంట సాగు చేశారు. అన్ని చెరువుల కింద ఇదే పరిస్థితి. భూగర్భ జలాలు పెరుగడంతో ఏటేటా పంటల సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయి. రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. గత సంవత్సరం యాసంగి జిల్లాలో రైతుల నుంచి నేరుగా సుమారు 93 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అనూహ్యంగా ఈ ఏడాది యాసంగి జిల్లాలో ధాన్యం కొనుగోలు 1.45 లక్షల మెట్రిక్ టన్నులు దాటడం విశేషం. జిల్లాలోని గ్రామాల్లో 196 కేంద్రాల ద్వారా యాసం గి ధాన్యం కొనుగోలు జరిగింది. ఐకేపీ 52, పీఏసీఎస్‌లు 121, రైతు ఉత్పత్తి సంఘాలు 18, మెప్మా 1 చొప్పున కొనుగోలు కేంద్రాలు నిర్వహించాయి. 192 కేంద్రాల్లో 1,45,200 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రసాద్ వెల్లడించారు. గత ఏప్రిల్ చివరి వారంలో మొదట రాయపర్తి మండలంలో యాసం గి ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ, సంగెం మండలాల్లోని గ్రామాల్లో ముందుగా, ఆ తర్వాత ఇతర మండలాల్లో ధాన్యం కొనుగోలు జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 19న జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయటం ముగిసిందని ప్రసాద్ ప్రకటించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు తరలించడమూ ఇటీవల పూర్తయిందని చెప్పారు.
రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటాల్ గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యాన్ని రూ.2,060, కామన్ రకం ధాన్యాన్ని రూ.2,040 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసింది. అత్యధికంగా పీఏసీఎస్ సెంటర్ల ద్వారా 89,818, ఐకేపీ సెంటర్ల ద్వారా 41,201, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా 12,428, మెప్మా సెంటర్ ద్వారా 1,753 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ తెలిపారు. రూ.297.52 కోట్ల ధాన్యం కొంటే ఇందులో రూ.135.42 కోట్ల ధాన్యం గ్రేడ్ ‘ఏ’, రూ.162.10 కోట్ల ధాన్యం కామన్ రకం ఉన్నట్లు ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం అమ్మిన రైతులకు డబ్బును ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కొద్ది మంది రైతులకు చెల్లింపులు జరగాల్సి ఉందని, త్వరలో వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ కానుందని వివరించారు. 192 సెంటర్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన యాసంగి ధాన్యాన్ని నిర్దేశిత సెక్టార్ల ద్వారా ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు రైస్ మిల్లులకు రవాణా చేసినట్లు ప్రసాద్ వెల్లడించారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు సాఫీగా జరపడంతో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సక్సెస్ అయ్యారు. ధాన్యం కొనుగోలు, రైతులకు డబ్బు చెల్లింపు, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడంపై అదనపు కలెక్టర్ శ్రీవత్స పౌరసరఫరాల శాఖ అధికారులతో తాజాగా సమీక్ష జరిపి పలు సూచనలు చేశారు. డీఎస్వో గౌరీశంకర్‌తో పాటు డీఎం ప్రసాద్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
కొనుగోలు ప్రక్రియ ముగిసింది..
హనుమకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ నెలలో ఐకేపీ, పీఏసీఎస్ కలిపి 163 సెంటర్లు ఏర్పాటు చేశాం. జిల్లాలోని 27,655 మంది రైతుల నుంచి 1.30 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాం. ఇప్పటి వరకు అందరు రైతులకు సంబంధించి వారి ఖాతాల్లో పూర్తిగా డబ్బులు జమ చేశాం.
– మహేందర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు తెలంగాణ సర్కారు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తున్నది. ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలకు ధాన్యం ముద్దయినా రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంది. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేశారు. రైతులకు ధాన్యం విషయంలో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, హనుమకొండ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇటీవల ముగిసిందని సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. అయితే ఈ యాసంగి సీజన్లో ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా జిల్లాలో 163 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 27,655 మంది రైతుల నుంచి 1.30 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో గ్రేడ్ ఏ లక్ష టన్నులు, కామన్ రకం 30వేల వరకు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 27,655 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా రైతుల ఖాతాల్లో పూర్తిగా డబ్బులు జమ చేసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు వివరించారు. మిగిలిన వారికి రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ చేసేందుకు ఎంపిక చేసిన రైస్ మిల్లులకు పంపించారు. కొనుగోళ్ల ప్రక్రియను నిత్యం స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని అన్నదాతలకు భరోసా కల్పించింది.
అన్నదాతలకు అండగా సర్కారు
రాష్ట్ర సర్కారు అన్నదాతలకు అండగా నిలుస్తున్నది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటు రైతు బంధు కింద పెట్టుబడి సాయం ఇవ్వడం, పండిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. రాష్ట్ర సర్కారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసింది. యాసంగిలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా జిల్లాలో 163 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రేడ్ – ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2060, కామన్ రకానికి రూ.2040 మద్దతు ధరతో కొనుగోలు చేశారు. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధరను చెల్లించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరం మేరకు గన్నీ సంచులను ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవడంతో ఎక్కడా సమస్యలు రాలేదు. అదే విధంగా రైతులకు కూడా ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో కొనుగోలు చేశారు. కాగా, గత వానాకాలం సీజన్లో హనుమకొండ జిల్లాలో 28,859 మంది రైతుల నుంచి 1.24 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి వంద శాతం చెల్లింపులు చేశారు.
ఐదు సెక్టార్ల ద్వారా రవాణా..
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రవాణా చేసేందుకు ధర్మసాగర్, భీమదేవరపల్లి, కమలాపూర్, హసన్‌పర్తి, శాయంపేటతో ఐదు సెక్టార్లుగా విభజించారు. ధర్మసాగర్ సెక్టార్లో ధర్మసాగర్, వేలేరు మండలాలు, భీమదేవరపల్లి సెక్టార్లో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ సెక్టార్లో కమలాపూర్, పరకాల, నడికూడ మండలాలను చేర్చారు. అలాగే హసన్‌పర్తి సెక్టార్లో హసన్‌పర్తి, కాజీపేట, ఐనవోలు, హనుమకొండ, శాయంపేట సెక్టార్లో శాయంపేట, ఆత్మకూరు, దామెర, మండలాలను చేర్చారు.