సెలవుల్లో సరదాగా గడిపిన విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో బుధవారం బడిబాట పట్టగా తొలిరోజు చాలాచోట్ల సమస్యలు స్వాగతం పలికాయి. అపరిశుభ్ర వాతావరణం, అసంపూర్తి పనులు, అసౌకర్యాల నడుమ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారం పంపిణీ చేయగా ఎక్కడా చూసినా సందడి నెలకొంది. ‘మన ఊరు-మన బడి’ని అటకెక్కించి తీసుకొచ్చిన ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పనులు అధికారుల చిత్తశుద్ధి లేక నత్తనడకన సాగుతూ పాఠశాలలు తెరుచుకునే నాటికీ పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పెచ్చులూడుతున్న పైకప్పులు, చెత్తాచెదారంతో కంపు కొడుతున్న మరుగుదొడ్లు, ప్రమాదకరంగా ఉన్న సంప్హౌస్లు, కాంట్రాక్టర్లు నిర్మాణం కోసం తెచ్చిన రాళ్లు, ఇసుక కుప్పలు, పారుతున్న మురుగునీరు, విద్యార్థుల ముందే ట్రాక్టర్‌తో చదును చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 12
బడిగంట మోగడంతో బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. మొదటిరోజు విద్యార్థులు సంబురంగా రాగా, పలుచోట్ల పూలతో ఉపాధ్యాయులు ఆహ్వానించగా చాలా బడుల్లో సమస్యలే పలకరించాయి. అలాగే స్వాగత ద్వారాలకు మామిడితోరణాలు, పూలు కట్టి ఆకర్షణీయంగా అలంకరించారు. నెలన్నర తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తమ స్నేహితులతో కలిసి ఆవరణలో కలియదిరిగి సందడి చేశారు.
అనంతరం తరగతి గదులకు చేరుకోగా, ప్రార్థన ముగిసిన తర్వాత విద్యార్థులకు ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చేతులమీదుగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు అందుకొని మురిసిపోయారు. అయితే అన్ని జిల్లాలకు విద్యార్థులకనుగుణంగా ఇవి సరఫరా కాలేదని తెలుస్తోంది. అలాగే హనుమకొండలోని మర్కజీ స్కూల్లో సంపు హౌస్‌కు నీళ్లు రాక విద్యార్థులు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. అలాగే వరంగల్ గాంధీనగర్‌లో గ్రెయిన్‌మార్కెట్ స్కూల్ ఆవరణ బురదనీటితో అధ్వానంగా ఉండగా పిల్లలు అందులోంచి జంప్ చేయాల్సి వచ్చింది.
అలాగే కాశీబుగ్గలోని నరేంద్రనగర్ ఉన్నత పాఠశాల, క్రిస్టియన్ హైస్కూల్, సుందరయ్యనగర్‌లోని పాఠశాలలు అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు, నిరుపయోగంగా ఉన్న వాటర్ టాప్స్, ప్రమాదకరంగా మారిన నీటి సంపులు, చెత్తాచెదారం, అధ్వాన పారిశుధ్యంతో కనిపించాయి. అలాగే వాజేడు, ఏటూరునాగారం మండలాల్లోని చాలా పాఠశాలల్లో కంపుకొడుతున్న మరుగుదొడ్లు, తలుపులు లేని బాలికల వాష్‌రూములు అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టాయి. అలాగే పాఠశాలల ప్రహరీ, వంటగదులు, భోజన శాలలు, మరుగుదొడ్లు చెత్తాచెదారంతో నిండి ఉండడం విద్యార్థులకు అసౌకర్యం కలిగించాయి. ఇలా బడిగంట మోగిన మొదటిరోజే విద్యార్థులకు పరీక్ష పెట్టాయి. ఇలా అయితే చదువులు ఎలా సాగుతాయని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.