వరంగల్ చౌరస్తా, నవంబర్16 : సామాజిక మాధ్యమాల్లో డాక్టర్‌గా చెలామణి అవుతూ ఎలాంటి శాస్త్రీయతలేని వైద్య సలహాలు, సూచనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వైద్యుడు వేములవలస రాంబాబును తెలంగాణ వైద్య మండలి పట్టుకుంది. హైదరాబాద్ దోమలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రతి (సాయివాణి హాస్పటల్)లో కాంపౌండర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఆల్ ఇన్ వన్ రామ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను ఏర్పాటు చేసుకొని ఎలాంటి విద్యార్హతలు లేకున్నా వైద్య సూచనలు, సలహాలను ప్రచారం చేస్తున్న విషయాన్ని గుర్తించి తెలంగాణ వైద్య మండలి సభ్యులు శనివారం పట్టుకొని అధికారులకు అప్పగించారు.
అంబులెన్స్‌లో అవసరమైన ఫస్ట్ ఎయిడ్ శిక్షణ తీసుకున్న వ్యక్తి వైద్య సలహాలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని మండలి ప్రతినిధులు తెలిపారు. నిందితుడిపై ఎన్ఎంసీ చట్టం 34, 54, టీఎస్ ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న వారిలో వైద్యమండలి సభ్యులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ తదితరులున్నారు.