పర్వతగిరి, జనవరి 10 : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామ పంచాయతీలు ఎంతో అభివృద్ధి సాధించాయని, గ్రామాలకు వస్తున్న నిధులు, జరుగుతున్న పనులపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం పర్వతగిరిలోని మంత్రి స్వగృహంలో జిల్లా పరిషత్ సీఈవోలు, డిప్యూటీ సీఈవోల డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీపీలకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నదని, శాశ్వత ఆస్తులను సమకూర్చుతున్నదని చెప్పారు. ఒక్కో జీపీకి ఏటా కనీసం రూ. కోటి నుంచి రూ. 2కోట్ల వరకు నిధులు వస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా పంచాయతీలకు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ అని అన్నారు.
కేంద్రం నుంచి మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1,100 కోట్లు రావాల్సి ఉండగా, రూ.150 కోట్లు రైతు కల్లాల కోసం ఖర్చు చేశామనే సాకుతో మొత్తం నిధులను కేంద్రం నిలిపివేసిందని తెలిపారు. ఈ డబ్బులు సరైన సమయంలో రాకపోవడంతోనే సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీరి ఇబ్బందికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. సర్పంచ్‌లు ఎవరైనా బిల్లులు రాలేదని చెప్తే వెంటనే కార్యదర్శులు స్పందించి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ట్రాక్టర్ల వినియోగంతో ఒక్కో జీపీ రూ. 10 నుంచి 15 లక్షల ఆదాయం సమకూరుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం వల్ల మంత్రినయ్యానని, ఇదే సమయంలో జీపీలకు భవనాలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ట్రాక్టర్లు, సీసీ రోడ్లు వేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బీ రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షుడు నరసింహులు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.