హసన్‌పర్తి, మే 8 : తడిసిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ రెండో డివిజన్ వంగపహాడ్లో పీఏసీఎస్ ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లోని డబ్బులు జమ చేస్తున్నటు చెప్పారు.
వడగండ్ల వానతో పంట నష్టం జరిగితే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలు తిరిగి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎకరాకు రూ.10వేల నష్ట పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని కొనియాడారు. గత పాలకులు వ్యవసాయం దండుగ అన్నారని, అదే వ్యవసాయాన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి పండుగలా మార్చారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రైతుల్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు. తెలంగాణ రైతాంగం కూడ దేశంలో ఒక భాగమే కదా.. కేంద్రం ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు, రైస్ మిల్లర్లతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. మక్కలకు రూ.1962 మద్దతు ధర ఇస్తున్నామని చెప్పారు.
రూ.5లక్షల చెక్కు పంపిణీ..
గుండ్లసింగారం (ఇందిరమ్మకాలనీ)కి చెందిన కూరపాటి సాంబయ్య ఇటీవల విద్యుదాఘాతంతో మృతిచెందాడు. కాగా, విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ.5లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అరూరి అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మెరుగు రాజేశ్‌గౌడ్, ఏవో అనురాధ, ఏఈవో అనూష, ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెండ్ల శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గనిపాక విజయ్, వీసం సురేందర్‌రెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గండు అశోక్‌యాదవ్, కుడా మాజీ డైరెక్టర్ రమేశ్‌యాదవ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చింత శ్రీనివాస్, బొమ్మగాని వెంకటేశ్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
హసన్పర్తికి చెందిన వేల్పుల గట్టయ్య అనారోగ్యంతో మృతి చెందగా, అతడి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. గట్టయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, మండలాధ్యక్షుడు బండి రజినీకుమార్, యూత్ అధ్యక్షుడు వల్లాల శ్రీకాంత్ ఉన్నారు.