నర్సంపేట, ఫిబ్రవరి 25 : రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో రైతులకు సబ్సిడీపై 300 కరంటు మోటర్లను పంపిణీ చేశారు. మంజూరైన మొత్తం యూనిట్లు 5010 అని, అన్నదాతలకు ఇచ్చే సబ్సిడీ రూ.7.51 కోట్లు అని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతి కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. రైతు రాజ్యంగా పేరు తెచ్చుకుంటున్నదన్నారు. రైతు బంధు ద్వారా ఆర్థిక సాయం అందిస్తుండడంతో రైతులు అప్పుల జోలికి వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఒక్క గుంట భూమి ఉన్నా రూ. 5 లక్షల బీమా సౌకర్యం వర్తింప జేస్తున్నారని చెప్పారు.
రుణమాఫీ కూడా చేస్తున్నారని తెలిపారు. రైతులకు పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి కొరతలు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కరంటు మోటర్లను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన వారు సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని డీడీ తీసి దరఖాస్తు చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీలు మోతె కళావతి, వేములపెల్లి ప్రకాశ్‌రావు, కాట్ల కోమల, విజేందర్, రమేశ్, ఊడుగుల సునీత, జడ్పీటీసీ పత్తినాయక్, సొసైటీ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతు బంధు సమితి బాధ్యులు రాయిడి రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మోతె జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.