జనగామ, జూలై 14 (నమస్తే తెలంగాణ) : వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్న జనగామ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం వెంటనే దేవాదుల నీటిని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్‌కు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ముందస్తు వానలు, అధిక వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ సూచనలతో జిల్లా రైతాంగం రోహిణి, మృగశిర కార్తెల్లోనే పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు నాటగా, వర్షాలు కురవక అవి మొలకెత్తక ఒక్కో రైతు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు నష్టపోయారన్నారు.
తర్వాత కురిసిన వర్షాలతో మరోసారి నాటిన విత్తనాలు మెలకెత్తినా.. ప్రస్తుత వర్షాభావ కారణంగా ఎండిపోతున్నాయని, నాట్లు వేసుకునేందుకు పోసుకున్న నారుమడులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతుండడంతో ప్రభుత్వం వెంటనే చెరువుల్లోకి దేవాదుల నీటిని వదిలి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న 9 దేవాదుల రిజర్వాయర్లు, 723 చెరువులు, కుంటలను పూర్తిస్థాయిలో నింపితే భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో సమృద్ధిగా నీరుండి వ్యవసాయం ముందుకు సాగే పరిస్థితి ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దేవాదుల జలాలతో చెరువులు, కుంటలు నింపాలని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని, కాలువల కోసం రైతుల వద్ద గత ప్రభుత్వం సేకరించిన భూముల్లో త్వరగా పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోత్కనూరి ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు ఉర్సుల కుమార్, కర్రి సత్తయ్య, రాజు పాల్గొన్నారు.