యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 114, వరంగల్ జిల్లాలో 50 సెంటర్లలో రైతుల నుంచి ముమ్మరంగా సేకరిస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన వడ్లనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. స్పెషలాఫీసర్లు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు రెండు జిల్లాల్లో 24 వేల టన్నుల వడ్లను కొన్నారు. కమలాపూర్, ఎల్కతుర్తి, ధర్మసాగర్ మండలాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకోగా, సేకరించిన వడ్లను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నారు. ధాన్యం అమ్మిన రైతులకు వెంట వెంటనే చెల్లింపులు చేస్తూ రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది.
వరంగల్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరికీ అన్నం పెట్టే రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఇస్తున్నది. ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వడ్లు పండించిన రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నది. యాసంగి వడ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు రూ.39.39 కోట్ల విలువైన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వడ్లు అమ్మిన రైతులకు వెంటనే చెల్లింపులు పూర్తి చేస్తున్నది. అకాల వానలతో కొనుగోళ్ల ప్రక్రియకు అటంకం కలుగుతున్నా.. ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నది. ముం దుగా పంట కోతకు వచ్చిన కమలాపూర్, ఎల్కతుర్తి, ధర్మసాగర్ మండలాల్లో కొనుగోళ్లు చివరి దశకు వచ్చా యి. తడిసిన వడ్లనూ మద్దతు ధరతో కొనుగోలు చే యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రైతుల్లో భరోసా కలిగింది.
ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏ ర్పాట్లు చేసింది. తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించి వెంటనే కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 164 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించింది. దశల వారీగా కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం 114 కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతున్నది. వీటిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పరిధిలో 73, ఐకేపీ పరిధిలో 41 ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 19 వేల 139 టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో ఏ గ్రేడ్ రకం వడ్లు 17 వేల 696 టన్నులు, సాధారణ రకం వడ్లు 1443 టన్నులు ఉన్నాయి. రెండు రకాలు కలిపి 18 వేల 843 టన్నులను మిల్లులకు తరలించారు.
అండగా సర్కారు..
వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది. పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.39,39,89,968 విలువైన వడ్లను కొనుగోలు చేసింది. కాంటాలు పూర్తయి వివరాలు ఆన్లైన్లో నమోదు కాగానే రైతులకు పైసల చెల్లింపులు పూర్తయ్యేలా ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసింది. పీఏసీఎస్‌ల పరిధిలోని కేంద్రాల్లో రూ.29.16కోట్ల విలువైన వడ్ల కొనుగోలు పూర్తయ్యింది. ఐకేపీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల పరిధిలో రూ. 10.23 కోట్ల విలువైన వడ్లను కొన్నారు. వడ్లు అమ్మిన రైతులకు ఇప్పటి వరకు రూ.25,19,83,392 ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మరికొంత మంది రైతులకు చెల్లింపు ప్రక్రియ జరుగుతున్నది.
పక్కాగా ఏర్పాట్లు..
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 3216 మంది రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేసింది. పీఏసీఎస్ పరిధిలోని కేంద్రాల్లో 2346 మంది, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో 870 మంది రైతులు వడ్లు అమ్మారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అకాల వానలతో పంటలు తడవకుండా చర్యలు చేపట్టింది. అవసరమైన ప్రతి చోట టార్పాలిన్లు, ఇతర వసతులు కల్పించింది. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేందుకు వీలుగా ప్రభుత్వం సంచులను సమకూర్చింది. ఇప్పటి వరకు మొత్తం 19 లక్షల 9 వేల 993 సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపించింది. యాసంగి కొనుగోళ్లు మొదలయ్యే ముందు జిల్లాలో 66 వేల 993 సంచులు ఉన్నాయి. కొత్తగా 18 లక్షల 43 వేల సంచులను ప్రభుత్వం సరఫరా చేసింది. కొనుగోలు కేంద్రాల్లోని అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తున్నది.
వరంగల్ జిల్లాలో..
వరంగల్, మే 8(నమస్తేతెలంగాణ) : వరంగల్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ఊపందుకుం ది. రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ, సం గెం తదితర మండలాల్లోని గ్రామాల్లో వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే సుమారు ఐదు వేల టన్నులు దా టింది. కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు చేరుతున్నది. సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో జిల్లాలో ఈ యాసంగి రికార్డు స్థాయిలో 1,12,612 ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 2.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉం టుందన్న అంచనా మేరకు పదమూడు మండలాల్లో 196 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెంటర్ల నిర్వాహకులకు కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొనుగోలు కేంద్రం వద్ద టెంటు, తాగునీరు, కరంటు సరఫరా, కుర్చీల వంటివి సమకూర్చాలని సహకార శాఖ జిల్లా అధికారి సంజీవరెడ్డి నిర్వాహకులకు చెప్పారు. ప్రతి కేంద్రానికి ప్యాడీ క్లీనర్, తేమ కొలిచే సాధనం, తూకం యంత్రం, టార్పాలిన్లను సరఫరా చేశారు. ఒక్కో సెంటర్‌కు ఒక ప్యాడీ క్లీనర్, తేమ కొలిచే సాధనం, రెండు వేయింగ్ మిషన్లు, 20 టార్పాలిన్ల అందజేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి ప్రసాదరావు తెలిపారు.
ఐదు సెక్టార్ల ద్వారా రవాణా..
ఎప్పటి మాదిరిగానే రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ, సంగెం తదితర మండలాల్లో ధాన్యం దిగుబడులు ముందుగా రావడం మొదలైంది. దీంతో అధికారులు ఈ మండలాల్లో ఇప్పటికే ఎనభైకిపైగా కొ నుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దాదాపు యాభై కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు కూడా మొదలయ్యాయని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. అకాల వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెం చాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ధా న్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రంలో తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోళ్ల ప్రక్రియను స్పెషలాఫీసర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వరికోతలు మొదలు కావడంతో గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఐదు సెక్టార్ల ద్వారా రైస్‌మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాయపర్తి, వర్ధన్నపేట, నెక్కొండ, నర్సంపేట, ఖానాపురం సెక్టార్ల ద్వారా ధాన్యాన్ని ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు రైస్‌మిల్లులకు చేర్చుతారని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రసాద్ చెప్పారు.
32 రైస్‌మిల్లులకు ధాన్యం..
జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన యాసంగి ధాన్యాన్ని ఈసారి కేవలం 32 రైస్‌మిల్లులకు మాత్రమే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిఫాల్టర్ల కు ప్రస్తుత యాసంగి ధాన్యం కేటాయించొద్దని చెప్పిం ది. దీంతో అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ క్లియర్ చేసిన 32 రైస్‌మిల్లులను ఎంపిక చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు.