శాయంపేట/కృష్ణకాలనీ, అక్టోబర్ 1 : పూల జాతరకు వేళైంది. ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ అని భక్తి పారవశ్యంతో ఆడపడుచులు పూలను పూజించే సంప్రదాయ పండుగే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక. పూలు బాగా వికసించే కాలంలో జరిగే పూలజాతర. ఆశ్వయుజ అమావాస్య (బుధవారం) నుంచి తొమ్మిది రోజుల పాటు చిన్న, పెద్ద అనే తేడాలేకుండా ఆడపడుచులంతా పూల వేడుకల్లో ఆడి, పాడతారు. తొలిరోజు ఎంగిలిపూలతో మొదలై వరుసగా అటుకుల, ముద్దపప్పు, నాన, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మగా, చివరిదైన తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా గౌరమ్మను సాగనంపడంతో వేడుకలు ముగుస్తాయి. బంధాలు, అనుబంధాలను గుర్తుచేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పూల సంబురం బతుకమ్మ. అంతటి ప్రాశస్త్యం ఉన్న బతుకమ్మను కనులపండువగా జరుపుకునేందుకు అడపడుచులు సిద్ధమయ్యారు.
బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. రంగరంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లతో వలయాకారంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు ఆద్యంతం అలరిస్తాయి. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ సాగే పాటల్లో మహిళలు తమ కష్టాలు, బంధుత్వం, ప్రేమ, ఆప్యాయత, భక్తి, భయంతో పాటు పురాణ ఇతిహాసాలను మేళవిస్తారు. బతుకమ్మ వర్షాకాలం చివరలో, శీతాకాలం మొదట్లో వచ్చే పండుగ. అప్పటికే చెరువులన్నీ నీళ్లతో నిండి రకరకాల పూలు ఆరబోసి ఉంటాయి. వీటిలో గునుగు, తంగేడు ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నందివర్ధనం వంటి పూలకు ఇదే సమయంగా చెబుతారు.
బతుకమ్మ పండుగ జరపుకోవడానికి వినియోగించే పూలకు కూడా ప్రత్యేకతలున్నాయి. ఔషధ గుణాలున్న పూలను బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, పోకబంతి, మల్లె, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు, గుమ్మడి, గులాబి, పట్టుకుచ్చులు పూలతో బతుకమ్మలను పేర్చి సంబురాలు జరుపుకుంటారు. తంగేడు పువ్వు షుగర్‌కు, తామర స్వచ్ఛతకు ప్రతీకగా, గునుగు పొకులు, క్షయవ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడతాయి. బతుకమ్మకు వాడే ప్రతి పువ్వు మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.
పెద్ద తాంబాలం లేదా సిబ్బిలో తంగేడు ఆకులను పేరుస్తారు. పూలను కట్టగా కట్టి కొనలను రంగుల్లో ముంచుతారు. తర్వాత బంతి, చామంతి, గన్నేరు, మందార, కలువ, తామర తదితర పూలను శంకం ఆకారంలో పేర్చుతారు. పేర్చిన బతుకమ్మ మీద రెండు తమలపాకులు పెట్టి పసుపుతో గౌరమ్మను చేసి పెడ్తారు. దీనికి కుంకుమ బొట్టు పెడ్తారు. మొదట్లో ఇంట్లో దేవుని వద్ద మొక్కి పీటపై పెట్టి వాడిపోకుండా చూస్తారు. సాయంత్రం మహిళలు, చిన్నారులు గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలు, ప్రధాన కూడళ్లలో ఒకచోట చేరి ఆడిపాడి బతుకమ్మలను చెరువులు, నదులలో నిమజ్జనం చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను, వాయనాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే చివరి రోజు సద్దుల బతుకమ్మను అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు.