సుబేదారి, జనవరి 25 : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను దేశ అత్యున్నత పురస్కారం వరించింది. దశాబ్దాల పాటు ఆయన చేసిన సామాజిక ఉద్యమాలకు అ రుదైన గౌరవం దక్కింది. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం శనివారం అవార్డులను ప్రకటించగా తెలంగాణ నుంచి ఓరుగల్లు బిడ్డ సామాజిక ఉద్యమాల నాయకుడు మంద కృష్ణమాదిగకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
హనుమకొండ హంటర్‌రోడ్డు న్యూశాయంపేటలో మంద చిన్న కొమురమ్మ-కొమురమ్మ దంపతులకు పదో సంతానంగా 1965 జూలై 7న మంద కృష్ణ జన్మించారు. ఆయన అసలు పేరు ఏలియా. భార్య జ్యో తి, ముగ్గురు పిల్లలు కిషన్, డాక్టర్ కృష్ణవేణి, కార్తీక్.
వామపక్ష భావజాలం, ప్రశ్నించేతత్వం ఉన్న మందకృష్ణ కొంతకాలంలో పీపుల్స్‌వార్ పార్టీలో నర్సంపేట, నెక్కొండ ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేశారు. అరెస్ట్ అయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్ వ్యవస్థాపకులు సత్యమూర్తితో కలిసి కారంచేడు, చుండూరు దళిత ఊచకోతకు వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అప్పుడే మంద ఏలియా నుంచి కృష్ణమాదిగగా పేరు మార్చుకున్నారు.
మంద కృష్ణ మాదిగలు, మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగ రంగా ల్లో జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకొని ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కో సం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. జూలై 7, 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో కొంతమంది యువకులతో కలిసి మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని ప్రారంభించారు. మాదిగ దండోరా ఉద్యమం తో మంద కృష్ణ అనతికాలంలో మా దిగలకు అత్మగౌరవ ప్రతికగా నిలిచారు. మాదిగ దండోరా ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా వ్యాపింపజేశారు. దండోరా ఉద్యమంతో 1997 లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా 2000 ఏప్రిల్ నుంచి 2004 నవంబర్4 వరకు ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. దీంతో మంద కృష్ణమాది గ మాదిగలకు బలమైన నాయకుడి గా పేరొందారు. 1994 ఎస్సీ వర్గీకర ణ ఉద్యమం మొదలుకొని తెలంగాణ ఉద్యమం, అనేక సామాజిక ఉద్యమాలు చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆగస్టు 1న 2024న సుప్రీంకోర్టు వెల్లడించిన అనుకూల తీర్పు వరకు 30 ఏళ్లుగా మంద కృష్ణమాదిగకు ఉద్యమాల చరిత్ర ఉంది.
ఓ వైపు ఎస్సీ వర్గీకరణ ప్రధాన ఎజెండాగా ఉద్యమిస్త్తూనే, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్, రేషన్ బియ్యం కోటా పెంపు, గుండెజబ్బుల పిల్లలకు ఆపరేషన్, ఆరోగ్య శ్రీ పథకం అమలు వంటి అనేక సామాజిక ఉద్యమాలకు కృష్ణమాదిగ నాంది పలికారు.
మంది కృష్ణమాదిగకు కేంద్ర అత్యున్నత అవార్డు పద్మశ్రీ అవార్డు దక్కడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట శ్రేణులు, మాదిగలు సంబురాలు జరుపుకొన్నారు. ఉమ్మడి వరంగల్‌కు చెందిన బీసీలు సంఘాల నాయకులు, ఇతర సామాజిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
మాదిగ రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగకు కేంద్ర అత్యున్నత పద్మశ్రీ అవార్డు దక్కడం యావత్ మాదిగ జాతికి దక్కిన గౌ రవమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
– గోవిందు నరేశ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు