వాజేడు, జూన్ 8 : తాగు నీటి కోసం ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంత టేకులగూడెం చెలక గ్రామస్తులు తండ్లాడుతున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని గోదావరికి కాలి నడకన వెళ్లి తెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో మిషన్ భగీరథతో పాటు బోరు నీళ్లు ఉన్నప్పటికీ గ్రామస్తులు మాత్రం గోదావరి నీటిని తాగేందుకు ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో గ్రామానికి తాగు నీరందించేందుకు గోదావరి వద్ద ఏర్పాటు చేసి మోటర్ నాలుగు రోజుల క్రితం మరమ్మతుకు గురైంది.
దీంతో గ్రామస్తులు చిన్న, పెద్ద తేడా లేకుండా బిందెలు, డబ్బాలు తీసుకొని కాలి నడకన గోదావరికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి బందం రవీందర్‌ను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో వివరణ కోరగా, గ్రామానికి సరిపడా బోరు, మిషన్ భగీరథ నీళ్లున్నాయని, గ్రామస్తులు గోదావరి నీళ్లు మాత్రమే తాగుతారన్నారు. గోదావరి నీటిని పంపింగ్ చేసే మోటర్ మరమ్మతుకు గురైందని, దానిని రిపేర్ చేసి నీరందేలా చూస్తానని తెలిపారు.