పాలకుర్తి, నవంబర్ 4: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కేసులు తప్పవని జనగామ జిల్లా పాలకుర్తి తహసీల్దార్ పొట్టబత్తుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం ‘ప్రభుత్వ కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారులు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ స్పందించారు.
వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఇక్కడి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించొద్దన్నారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ గోనె మైసిరెడ్డి, ఆర్ఐ శ్రీకాంత్, రాకేశ్, సీఈవో రణధీర్, చిన్న యాదయ్య, బానోత్ వెంకట్ పాల్గొన్నారు.