వరంగల్, మార్చి 28: గ్రేటర్ కార్పొరేషన్‌కు పన్నులే ప్రధాన ఆదాయం. వాటి వసూళ్లతో వచ్చే ఆదాయంతోనే పాలన సాగిస్తున్నది. అయితే ప్రభుత్వ సంస్థలు బల్దియాకు ఏంళ్ల తడబడి పన్నులు చెల్లించకుండా మొండి బకాయిదారులుగా మారాయి. సా మాన్యులపై జులుం చేసి పన్నులు వసూలు చేస్తున్న బల్దియా అధికారులు ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేయడంలో మిన్నకుంటున్నారనే విమర్శలు వె ల్లువెత్తుతున్నాయి.
గ్రేటర్ కార్పొరేషన్లో కేంద్ర ప్రభు త్వ సంస్థల అస్తులు 639 ఉండగా, వీటి ఆస్తి పన్నుల బకాయిలు రూ. 30.95 కోట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఆస్తులు 917 ఉండగా, వాటి ఆస్తి పన్నులు రూ. 50.72 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో నోటీసులు జారీ చేస్తే ‘ప్రధాన కార్యాలయానికి పంపిం చాం. ఇంకా బడ్జెట్ విడుదల కాలేదు’ అని సమాదానం చెబుతున్నారని బల్దియా అధికారులు తెలిపా రు. దీంతో బల్దియా పన్నులు ఎంత వసూళ్లు చేసినా పెండింగ్ బకాయిలు రూ. కోట్లతో ఉండడంతో బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఆస్తి పన్నుల వసూళ్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు రోజులే మిగిలాయి. 15 రోజులుగా బల్దియాలోని అన్ని విభాగాల అధికారులు రాత్రింబవళ్లు పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. గ్రేటర్ కార్పొరేషన్లో పరిధిలో 2,37,819 అసెస్మెంట్లు ఉండగా, వాటికి సంబంధించిన ఆస్తీ పన్నుల పెండింగ్‌తో కలుపుకొని రూ.266.04 కోట్లు ఉన్నాయి. వాటిలో 639 కేంద్ర ప్రభుత్వ ఆస్తు లు, 917 రాష్ట్ర సర్కారుకు చెందిన ఆస్తులు ఉన్నా యి.
మిగితా వాటిల్లో 1,95,440 గృహాలు, 11,604 కమర్షియల్, 29,219 రెసిడెన్షియల్ కం కమర్షియల్ (మిక్స్డ్) ఉన్నాయి. గ్రేటర్‌లోని 1,95, 440 నివాస గృహాల్లో ఇప్పటి వరకు 1,09,894 నుంచి రూ. 35.46 కోట్ల పన్నులు వసూలు చేశారు. ఇంకా 85,546 గృహాల నుంచి రూ. 53.92 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. 11,604 కమర్షియల్ గృహాల్లో 8112కు చెందిన ఆస్తి పన్నులు రూ. 21,97 కోట్లు వసూలు చేయగా, మిగితా 3,492 నుంచి రూ. 29.85 కోట్ల బకాయిలు వసూలు చేయాల్సి ఉన్నది.
మిక్స్డ్ అసెస్మెంట్లు 29,219ల్లో 21,894కి చెందిన పన్నులు రూ.24.67 కోట్లు రాగా, ఇంకా 7,325 అసెస్మెంట్ల నుంచి రూ.16. 31 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆస్తుల్లో కేవలం 16 ఆస్తులకు చెందిన రూ. 14.77 లక్షల పన్నులు వసూళ్లు చేయగా, ఇంకా 623 అసెస్మెంట్లకు చెందిన రూ. 30.95కోట్ల పన్నులు రావాల్సి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 917 అసెస్మెంట్లలో 400 అసెస్మెంట్ల నుంచి రూ. 20 కోట్లు వసూళ్లు చేయగా, ఇంకా 517 అసెస్మెంట్ల నుంచి రూ. 50.72 కోట్ల ఆస్తి పన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. సామాన్య ప్రజలు భయంతో ఆస్తి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ బడాబాబులతో పాటు ప్రభుత్వ సంస్థలు చెల్లించకపోవడం గమనార్హం.