కురవి, జూలై 06 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కురవి మండల కేంద్రంలో పోగుల శ్రీనివాస్ గౌడ్(ఓం ఫంక్షన్ హాల్) ప్రాంగణంలో జరుగుతున్న మహబూబాబాద్ జిల్లా మూడవ మహాసభలు రెండవ రోజు సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారధి అధ్యక్షతన కొనసాగాయి. ప్రాంగణంలో పార్టీ జెండాను కురవి సీనియర్ నాయకులు దూదికట్ల సారయ్య ఆవిష్కరించారు. పార్టీ అమరవీరుల స్థూపం వద్ద నాయకులు పూలు జల్లి నివాళులర్పించారు. అనంతరం ప్రతినిధుల మహాసభలో శ్రీనివాసరావు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుందని నేటికీ మత ప్రాతిపదికనే పాలన సాగిస్తుందని విమర్శించారు.
కేవలం కార్పోరేట్ సంస్థలకు, కార్పోరేట్ యజమానులకు దేశాన్ని దారాదత్తం చేయాలని బిజెపి పావులను కలుపుతుందని ఆరోపించారు. బ్యాంకులలో రుణాలు తీసుకున్న సామాన్యులను ముక్కు పిండి వసూలు చేసే కేంద్ర ప్రభుత్వం ఆదాని, అంబానీలకు వేల కోట్ల రుణాలు ఎలా మాఫీ చేశారో చెప్పాలన్నారు. అటవీ సంపదను కార్పోరేట్ శక్తులకు అప్పచెప్పేందుకు వెనుకాడని బిజెపి పేద ప్రజలకు ఏమి చేయదన్నారు. ఆపరేషన్ కగార్ లక్ష్యం కూడా అదేనన్నారు. కగారు పేరుతో అమాయకులైన ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అంతమొందిస్తుందన్నారు.
రైతులతో పాటు కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ చట్టాలతో కార్మికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారని గుర్తు చేశారు. లేబర్ కోడ్ లకు ఈనెల 9వ తేదీన బీజేపీ అనుబంధ బీఎంఎస్ తప్ప అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కోట్లాది మంది కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు, కట్టెబోయిన శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు నల్లు సుధాకర్ రెడ్డి, అజయ్ సారధి రెడ్డి, మామిండ్ల సాంబ లక్ష్మి, రేషపల్లి నవీన్, తురక రమేష్, పెరుగు కుమార్, బిక్షపతి, కరణం రాజన్న, సందీప్, కన్నె వెంకన్న, బుడుమ వెంకన్న, ఉప్పలయ్య, గురువయ్య, నెల్లూరి నాగేశ్వర్ రావు, పెరుగుకుమార్, చింతకుంట్ల వెంకన్న, వరిపెల్లి వెంకన్న, బాలకృష్ణ, తురక రమేష్, బుర్ర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.