హనుమకొండ, మే 01:మే డే స్పూర్తితో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని సిపిఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా గురువారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం ఎదుట అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి, అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని విమర్శించారు. దేశ సంపదను తన కార్పొరేట్ మిత్రులకు మోదీ కట్టబెడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను రోడ్డున పడవేస్తున్నారన్నారు.
కార్మికులు ఉద్యమించకుండా కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను కాలరాశారని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాపాడుకునేందుకు, కార్పొరేట్ శక్తుల శ్రమ దోపిడీని అరికట్టేందుకు కార్మిక వర్గం మే డే స్పూర్తితో ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, సీపీఐ రాష్ర్ట కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్, జిల్లా నాయకులు మునిగాల భిక్షపతి, మాలోతు శంకర్, బాషబోయిన సంతోష్, కొట్టేపాక రవి, కండే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.