మహబూబాబాద్ రూరల్, మే 31 : ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జంక్షన్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు. శనివారం మానుకోట పట్టణంలోని ముత్యాలమ్మ గుడి, మూడు కొట్ల సెంటర్లు, కురవి రోడ్లో చేపట్టిన నూతన జంక్షన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు జంక్షన్ల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలని, జిల్లా కేంద్రానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైన చోట డివైడర్లు ఏర్పాటు చేయాలన్నారు.
ముత్యాలమ్మ గుడి వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా జంక్షన్ నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పట్టణ శివారులోని డ్రైనేజీ వ్యవస్థతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తక్కళ్లపల్లి సూచించారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, రఘు, కరుణాకర్‌రెడ్డి, శంకర్, గోపీ, వెంకన్న తదితరులున్నారు.