హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 18: బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుల కోసమే పని చేయడంలేదని, కొందరివాడు కాదు.. అందరివాడని స్వేరోస్ స్టూడెంట్స్యూనియన్(ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ అన్నారు. ప్రవీణ్ కుమార్ని ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ డిబేట్లో పాల్గొనమని చెప్పి ఏబీఎన్ న్యూస్ ఛానల్లో దళిత నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ జంక్షన్లో ఎస్ఎస్యూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుల,మతాలకు పార్టీలకతీతంగా ఎంతో మంది పేద విద్యార్థులకు బడుగు, బలహీన వర్గాలకు అగ్రవర్ణాల్లో పేదల ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడన్నారు. అలాంటి వ్యక్తిని దళిత నాయకుడు అనే ముద్ర వేయడాన్ని సిగ్గుచేటన్నారు. ఆంధ్రజ్యోతి మెయిన్ స్ట్రీమ్ మీడియా దళిత నాయకుడు అని అవమానిస్తున్న వేముల రాధాకృష్ణ తన మీడియా ద్వారా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్యూనియన్ నాయకులు చెట్టుపల్లి శివకుమార్, బన్నీ, వంశీ, శ్రావణ్, కృష్ణ ,రాజేష్, సురేష్, కిరణ్, మహేష్, రాకేష్, సుఖేష్, సిద్దు, ముఖేష్ పాల్గొన్నారు.