వరంగల్, జూన్ 11(నమస్తేతెలంగాణ) : నకిలీ విత్తనాలపై వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని ఓ ఇంట్లో అనధికారికంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలు లభ్యమైన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో విత్తన విక్రయాలపై నిఘా పెట్టారు. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు రేట్లు పెంచి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేకంగా రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. బృందం సభ్యులు వివిధ ప్రాంతాల్లోని విత్తన దుకాణాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. దుకాణాల లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, విత్తనాల నిల్వలు, వాటి అనుమతులు, బ్యాచ్ నంబర్లు, ఇన్వాయిస్లు, గడువు తేదీలను పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న విత్తనాల విక్రయాన్ని నిలిపివేస్తున్నారు.
వానకాలం మొదలుకానున్న నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రధానంగా విత్తనాల అమ్మకంపై గట్టి నిఘా పెట్టింది. తనిఖీలకు వివిధ శాఖల అధికారులను రంగంలోకి దింపింది. వ్యవసాయశాఖలో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. నకిలీ, కల్తీ, అనధికార విత్తనాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో కొద్దిరోజుల నుంచి వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులు విత్తన అమ్మకాలపై దృష్టి సారించారు. విత్తన దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. దుకాణాల లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, విత్తనాల నిల్వలు, వాటి అనుమతులు, బ్యాచ్ నంబర్లు, ఇన్వాయిస్లు, ఉత్పత్తి, అమ్మకం నిర్ణీత గడువు తేదీలను పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న విత్తనాల విక్రయాన్ని నిలిపివేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది వానకాలం 3,02,307 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వరి సాగు విస్తీర్ణం 1,35,278 ఎకరాలు, పత్తి 1,28,201 ఎకరాలుగా ఉంది. మరో కొద్దిరోజుల్లో రైతులు పత్తి పంటను సాగు చేసే అవకాశం ఉంది.
దీంతో ఇప్పటికే వివిధ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. కొందరు రైతులు పత్తి విత్తనాలను కొనుగోలు చేసి అనువైన వాతావరణం ఏర్పడగానే నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, మార్కెట్లో విత్తన డీలర్లలో కొందరు డిమాండ్ ఉన్న కంపెనీల పత్తి విత్తనాల రేటు పెంచి అమ్ముతున్నారు. వరంగల్‌లోని ఐదు విత్తన దుకాణాల డీలర్లు ఓ కంపెనీకి చెందిన పత్తి విత్తన ప్యాకెట్లను బ్లాక్‌లో అమ్మారని, సదరు కంపెనీ పత్తి ప్యాకెట్ ఎమ్మార్పీ రూ.వెయ్యిలోపు ఉంటే రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు విక్రయించారని రైతు సంఘాల ప్రతినిధులు నిఘా విభాగాల అధికారుల దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఈ విత్తనాలు మార్కెట్లో లేవని చెబుతున్నారని, ఒక్కో విత్తన ప్యాకెట్‌కు అదనంగా రైతుల నుంచి రూ.1,500కుపైగా గుంజిన డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు తదితర జిల్లాల నుంచి వివిధ కంపెనీల పేర్లతో ఉన్న పత్తి విత్తనాలను తెచ్చి రసీదు లేకుండా రైతులకు విక్రయిస్తున్నారని నిఘా విభాగాలకు ఫిర్యాదులందాయి. ఈ క్రమంలో పోలీసులు కొద్దిరోజుల క్రితం చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామంలో ఓ విత్తన వ్యాపారి ఇంట్లో నిల్వ ఉన్న పదిహేడు విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని కర్నూలు జిల్లా ఆదోని నుంచి తెచ్చి అనధికారికంగా ఇంట్లో నిల్వ చేశాడని గుర్తించారు. దీంతో పోలీసులు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. పోలీసులు పట్టుకోవడానికి ముందే ఆ వ్యాపారి రైతులకు ఎలాంటి రసీదు లేకుండా కొన్ని పత్తి విత్తన ప్యాకెట్లను విక్రయించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఆన్లైన్ ద్వారా వ్యాపారి ఈ విత్తన బిజినెస్ చేస్తున్నాడని కనుగొన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న విత్తన ప్యాకెట్లలో నాలుగింటిని పరీక్షల కోసం వ్యవసాయశాఖ అధికారులు తమ శాఖ ల్యాబ్‌కు పంపారు. ఈ నివేదిక వస్తే జల్లిలో పట్టుబడిన పత్తి విత్తనాలు నకిలీవా, అసలివా తేలనుంది. ఈ ఘటనలో పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు విత్తన అమ్మకాలపై తాజాగా మరింత నిఘా పెంచారు.
వ్యవసాయశాఖలో టాస్క్‌ఫోర్స్ బృందాలు..
ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ విత్తన విక్రయాలపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలను నియమిస్తూ కొద్దిరోజుల క్రితం జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఉషాదయాళ్ ఉత్తర్వులు విడుదల చేశారు. నర్సంపేట ఏడీఏ జే అవినాశ్‌వర్మ నేతృత్వంలో ఏర్పడిన ఒక బృందంలో సీడ్ సర్టిఫికేషన్ అధికారులు టీ వేణుమాధవ్, కే విజయ్, డీఏవో కార్యాలయ ఏడీఏ వీ విజయ్‌చంద్ర నేతృత్వంలో ఏర్పడిన రెండో బృందంలో వర్ధన్నపేట ఏడీఏ వీ సురేశ్‌కుమార్, రీజినల్ మేనేజర్ బీ రఘు ఉన్నారు. ఈ రెండు బృందాల్లోని అధికారులు విత్తన దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో తమ దృష్టికి వచ్చిన అంశాలను డీఏవో ఉషాదయాళ్ దృష్టికి తెస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వ్యవసాయశాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృందం కూడా జిల్లాలో మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లోని విత్తన దుకాణాల్లో తనిఖీలు చేసింది. పోలీసు శాఖలోని ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా షాపుల్లో నిల్వ ఉన్న విత్తనాలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? లేదా?, అమ్మకం గడువు ఉందా? ముగిసిందా?, అని పరిశీలిస్తున్నారు. విత్తన దుకాణాల నిర్వాహకులు స్టాక్ రిజిస్టర్‌ను నిర్వహిస్తున్నారా?, లేదా? అని ఆరా తీస్తున్నారు. లైసెన్సు ఉన్న దుకాణాల్లోనే కాకుండా కొందరు వ్యాపారులు అనధికారికంగా పత్తి విత్తనాలు అమ్ముతుండడంపై తమ నెట్వర్క్ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.