హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8: కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నిజమైన ప్రజానాయకుడు.. పేదలు, కార్మికులు, రైతుల కోసం ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమై ఉంటుందని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హనుమకొండ నక్కలగుట్ట హరిత కాకతీయలో సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ కీర్తిశేషులు కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్కరణ సభ సందర్భంగా సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి నిజాయితీ, క్రమశిక్షణ, సేవా తపన ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అలాంటి గొప్ప నాయకుడితో ఉన్న అనుబంధం గర్వకారణమన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. సిద్ధాంతాలు చెప్పడమే కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం 65 సంవత్సరాలు నిబద్ధతతో జీవించిన వ్యక్తి కామ్రేడ్ సురవరం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ, రాష్ర్ట, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.