వరంగల్‌చౌరస్తా, జనవరి 5 : ‘పైన పటారం.. లోన లొటారం’ అన్న చందంగా ఉంది కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 150 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రి నిర్వహణ సరిగా లేక రోగులు, అటెండెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు అంతస్తులున్న ఈ దవాఖానలో ఆరు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయగా వాటిలో ఒకటి మా త్రమే పని చేస్తున్నది. దీంతో పై అంతస్తులకు వెళ్లేందుకు రోగులు, అటెండెంట్లు మెట్లు లేదా ర్యాంపు మార్గాన్ని వినియోగిస్తున్నారు.
ఇందులోని ఆధునిక యంత్రాలు నిర్వహణ సరిగా లేక తరుచూ పాడవుతున్నాయి. ఇటీవల సీటీ స్కాన్, క్యాథ్లాబ్ యంత్రాలు పనిచేయకపోవడంతో అత్యవసర పరిస్థితిలోని రోగులను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆపరేషన్ థియేటర్లలో బిగించిన ఏసీలు సైతం మొరాయించడంతో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఎక్కువ సమయం శస్త్ర చికిత్సలు చేసేందుకు వైద్యులు సైతం వెనకడుగు వేస్తున్నారు. అలాగే నిర్మాణ లోపాలు, నాసిరకం పనుల మూలంగా ఇప్పటికే 15 శాతం సీలింగ్ కూలిపోయినట్లు ఉద్యోగులు తెలిపారు.
నూతన భవనమే అయినప్పటికీ నాణ్యతాలోపం కారణంగా భవనం పెచ్చులూడుతున్నది. వార్డుల్లోని టాయిలెట్స్‌లో నీటి కొరత ఉంటున్నదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులను తరలించే ర్యాంప్ మార్గమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. ఈ ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ అయినప్పటికీ పూర్తిగా ఎంజీఎం మీదనే ఆధారపడుతున్నది. కాటన్, సిరంజిలు, శస్త్ర చికిత్సకు అవసరమైన యంత్ర, వస్తు సామగ్రి మొత్తం ఇక్కడి నుంచే రావాలి. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ దవాఖానకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం లేదు.
250 పడకలతో ఏర్పాటు చేసిన హాస్పిటల్ బాధ్యతలు పూర్తిగా ఎంజీఎం ఆస్పత్రి బడ్జెట్ మీదనే కొనసాగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. సూపర్ స్పెషాలిటీలో ఓపీ సేవలకు అనుసంధానంగా అత్యవసర విభాగాన్ని సైతం ప్రారంభించాలని రోగులు కోరుతున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసర పరిస్థితి వస్తే సేవలందించలేకపోతున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ సమయంలో ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించడానికి అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో మరింత ఇబ్బందికరంగా మారుతున్నది.