మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఇప్పుడు సెలవుల్లో ఆటలతో ఎంజాయ్ చేస్తున్నారు. తమకు నచ్చిన క్రీడలను నేర్చుకొనేందుకు మైదానాలు, స్టేడియాలకు చేరి ప్రాక్టీస్ చేస్తూ సరదాగా గడుపుతున్నారు. పిల్లల్లో మానసికోల్లాసం, ఆటల్లో నైపుణ్యం కోసం ఈ నెల 1 నుంచి మొదలైన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలకు ఉత్సాహంగా వస్తూ హుషారుగా తర్ఫీదు పొందుతున్నారు. క్రికెట్, వాలీబాల్, బాక్సింగ్ సహా 11 రకాల క్రీడాంశాలపై ఇస్తున్న శిక్షణకు సుమారు వెయ్యిమంది బాలబాలికలు వస్తుండగా హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కళకళలాడుతోంది. అలాగే స్పోర్ట్స్ డ్రెస్, మెటీరియల్స్ కొనుగోళ్లతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
– హనుమకొండ చౌరస్తా, మే 20
జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఇండోర్ స్టేడియంలో వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు క్రీడాకారులతో సందడిగా కనిపిస్తున్నాయి. పిల్లలకు మానసికోల్లాసం, క్రీడల పట్ల నైపుణ్యం పెంపొందించేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తర్ఫీదు ఇస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తర్వాత ఎప్పటిలాగే చిన్నారుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించుకొనేందుకు మే 1 నుంచి 31 వరకు ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. 4వ తరగతి నుంచి 12వ తరగతి బాలబాలికలు ఔట్‌డోర్, ఇండోర్ స్పోర్ట్స్‌తో 10 రకాల క్రీడాంశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం హనుమకొండలోని జేఎన్ఎస్, ఇండోర్ స్టేడియంలో సుమారు వెయ్యి మందికిపైగా క్రీడల్లో పాల్గొంటున్నారు. శిక్షణ శిబిరాల్లో నెల రోజుల పాటు విద్యార్థులు శిక్షణ తీసుకొని ఆటల్లో రాణిస్తారు. అలాగే వారి శారీరక, మానసిక దృక్పథంలో మార్పులు రావడంతో పాటు కండరాలు, ఎముకల పెరుగుదల, రక్తప్రసరణ, మెదడు, గుండె చక్కగా పనిచేస్తాయి. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
షటిల్ బ్యాడ్మింటన్..
షటిల్ అన్ని రకాల వయస్సు వారు ఆడే ఆట. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి చేస్తుంది. సాధారణంగా షటిల్ బ్యాట్ ధర రూ.50 నుంచి టోర్నమెంట్ ఆడే క్రీడాకారుల బ్యాట్ల ధరలు రూ.17 వేల వరకు ఉన్నాయి. యోనెక్స్, లెనిన్, కామాక్షి, క్యూకీ, మాక్స్‌ప్రో, యాంగ్ తదితర రకాలు మార్కెట్లో ఉన్నాయి.
ఆత్మరక్షణకు కరాటే..
కరాటే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బాలికలు కరాటే నేర్చుకోవడం అవసరం కూడా. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే శిక్షణ కూడా ఇస్తున్నారు. జిల్లాలో వేసవి శిక్షణ కేంద్రాలు కూడా వెలిశాయి. అయితే వేసవిలో విద్యార్థులు కరాటే నేర్చుకోవడానికి అవసరమైన డ్రెస్‌లు రూ.300, నాన్చాక్ ధరలు రూ.60 నుంచి రూ.120 వరకు ఉన్నాయి.
స్మిమ్మింగ్
వేసవిలో స్విమ్మింగ్(ఈత)కు విద్యార్థులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం అవసరమయ్యే గాగుల్స్(కంటి అద్దాలు), రూ.70 నుంచి రూ.250 వరకు ఉండగా క్యాష్ నిక్కర్ రూ.80 వరకు విక్రయిస్తున్నారు.
పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారు..
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాం. వివిధ రకాల క్రీడా విభాగాల్లో కోచ్‌ల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నాం. వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు ఉదయం, సాయంత్రం కొనసాగుతున్నాయి. సుమారు వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తర్ఫీదు పొందుతున్నారు.
– గుగులోత్ అశోక్‌కుమార్, జిల్లా క్రీడలు, యువజన అధికారి
చదరంగం..
జిల్లాలో చెస్(చదరంగం)కు మంచి ఆదరణ ఉంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచడానికి చెస్ ఎంతో దోహదపడుతుంది. ఇంట్లోనే కూర్చుని ఈ ఆట ఆడుకోవచ్చు. మెదడుకు మేత చదరంగం ఆట. పిల్లలకు ఈ క్రీడ అలవరిస్తే చదువులో కూడా రాణించే అవకాశాలున్నాయి. చెస్‌బోర్డు ధర రూ.55 నుంచి రూ.700 వరకు ఉన్నాయి.
వైకుంఠపాలి..
ఇంట్లో పిల్లలు, పెద్దలు కలిసి ఆడే ఆట వైకుంఠపాలి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఆడేవారు. ఈ మధ్య ఈ ఆటకు ఆదరణ పెరిగింది. నిచ్చెన, పాములు ఉండే ఈ ఆటను ఆడడం చాలా సరదాగా ఉంటుంది. గవ్వలతో ఆడుతారు. ఎన్ని గవ్వలు పడితే అన్ని గడులు దాటాల్సి ఉంటుంది. అందులో నిచ్చెన వస్తే పైకి వెళ్లడం, పాములు వస్తే కిందకు దిగాలి. ఆట మొత్తంలో ఎవరు వైకుంఠానికి చేరుతారో వారే విజేతలన్నమాట. ఈ ఆట ఆడే వైకుంఠపటం ధర రూ.40 నుంచి రూ.250 వరకు లభిస్తున్నాయి.
క్యారమ్ బోర్డు..
క్యారమ్ బోర్డు క్రీడ ఇంట్లో కూర్చొని ఆడే ఆట. పిల్లలు, పెద్దలు ఈ ఆట ఆడడం సహజం. చాకచక్యంగా, సమయస్ఫూర్తితో ఆడే ఆట ఇది. అయితే ప్రస్తుతం క్యారమ్బోర్డులు దుకాణాల్లో రూ.400 నుంచి రూ.5 వేల వరకు ఉన్నాయి.
వివిధ రకాల ఆటల్లో తర్ఫీదు
జేఎన్ స్టేడియంలో వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కోచ్‌ల పర్యవేక్షణలో మొత్తం 11 రకాల క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. వారికి అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్, వాలీబాల్, తైక్వాండో, కిక్‌బాక్సింగ్, ఖోఖో, బాక్సింగ్, సాఫ్ట్‌బాల్‌తో పాటు ఇతర ఆటల్లో శిక్షణ పొందుతున్నారు.
బిజీబిజీగా స్పోర్ట్స్ షాప్‌లు
సమ్మర్ హాలీడేస్‌లో పిల్లలు ఆటలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇళ్లలోనే ఉన్న విద్యార్థులు స్థానికంగా ఉన్న క్రీడా మైదానాలు, ఇండోర్‌లోనూ ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఇందుకోసం బాలబాలికలు తమకు అవసరమయ్యే వస్తువులు కొనుగోలు చేస్తుండడంతో స్పోర్ట్స్ షాపులు బిజీబిజీగా కనిపిస్తున్నాయి. రోజురోజుకు స్పోర్ట్స్ ఐటెమ్స్ కొనుగోలు చేస్తుండడంతో చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో నగరంలోని దుకాణాలన్నీ సందడిగా మారాయి. క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్యారమ్స్, హాకీ, షటిల్, తదితర ఆటలపై మక్కువ చూపుతున్నారు. మార్కెట్లో లభిస్తున్న క్రీడాపరికరాలు. వాటి ధరలు.. ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
క్రికెట్ క్రేజీ..
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రేజీ కొనసాగుతోంది. క్రికెట్ అంటేనే నేటితరం విద్యార్థులు, యువకులు వెర్రెత్తిపోతున్నారు. క్రికెట్ ఆట నగరాల నుంచి గ్రామాలకు పాకింది. ఇంకేముంది సెలువులు రావడంతో ఉదయాన్నే చిన్నారులు బ్యాట్లు, బాలు చేతబట్టి మైదానాల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ ఆట ఆడాలంటే క్రికెట్ సామగ్రి సొంతంగా అవసరం. క్రికెట్ బ్యాట్ రూ.250 నుంచి మొదలు రూ.4వేల వరకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. బీడీఎం, ఎస్జీ, ఎస్ఎఫ్, ఎస్ఎస్, కోకో బుర్రా తదితర రకాల బ్యాట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.150 నుంచి రూ.600 వరకు పీస్బాల్ అమ్ముతున్నారు. స్టంప్స్, బాల్స్, బ్యాట్, గ్లౌవ్స్ అన్ని కలిపి రూ.10వేల వరకు లభిస్తున్నాయి.
వాలీబాల్
వాలీబాల్ ఓ మంచి వ్యాయామ క్రీడ. బాగా ఎత్తున్న వారికి ఈ క్రీడ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కాస్కో, నివై, ఆష్టో, విక్సన్ తదితర కంపెనీల వాలీబాల్స్ రూ.300 నుంచి రూ.1500 వరకు అందుబాటులో ఉన్నాయి. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్ ధరలు ఆయా కంపెనీల ఆధారంగా రూ.220 నుంచి రూ.700 వరకు ఉన్నాయి.
బాక్సింగ్
బాక్సింగ్ క్రీడ అరుదుగా ఆడుతుంటారు. ఇటీవల జిల్లాకేంద్రం నుంచి బాక్సింగ్ పోటీలకు వెళ్తున్న క్రీడాకారులు పలు పతకాలు సాధిస్తున్నారు. బాక్సింగ్‌ను నవతరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన దుస్తులు, సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. కిట్‌బ్యాగ్(ఇసుక నింపిన సంచి) రూ.180 నుంచి రూ.600, గ్లౌజెస్ రూ.350, బ్యాండేజ్ రూ.120 ధరల్లో లభిస్తున్నాయి.