Sardar 2 OTT | తమిళ హీరో కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. కార్తీ కెరీర్లో విజయవంతమైన చిత్రాల్లో ఒకటైన ‘సర్దార్’కు కొనసాగింపుగా రూపొందింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సీక్వెల్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు మిశ్రమ స్పందనే లభించింది. ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగించుకుని డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘సర్దార్ 2’ అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముఖ్యంగా ఈ సినిమా థియేటర్లలో సెప్టెంబర్ 10న విడుదల కాగా.. కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం.
అంతేకాదు.. ఓటీటీ విడుదలను కేవలం తమిళానికి మాత్రమే పరిమితం చేయకుండా పలు భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారికి, మరోసారి సినిమాను చూడాలనుకునే కార్తీ అభిమానులకు ఇది మంచి అవకాశం కానుంది. ‘సర్దార్ 2’లో కార్తీ మరోసారి విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. రా ఏజెంట్ చంద్రబోస్ అలియాస్ సర్దార్ పాత్రలో ఒక వైపు కనిపిస్తే.. మరోవైపు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా నటించారు. ఈ రెండు పాత్రల మధ్య ఉండే వ్యత్యాసం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ కథానాయికలుగా నటించగా.. ఎస్.జే. సూర్య ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. స్పై యాక్షన్ అంశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సీఎస్ సంగీతం అందించగా.. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ చేశారు. తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయిన ‘సర్దార్ 2’.. ఓటీటీలో మాత్రం ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి. ముఖ్యంగా బహుభాషల్లో స్ట్రీమింగ్ కావడంతో డిజిటల్ ప్రేక్షకుల్లో సినిమాపై మరోసారి ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంది.