చౌటుప్పల్, సెప్టెంబర్ 28 : చౌటుప్పల్ పట్టణ కేంద్రం మీదుగా వెళ్తున్న 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా స్థానిక బస్టాండ్ నుండి తంగడపల్లి రోడ్డు వరకు చేపడుతున్న అండర్పాస్, వంతెన పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. నెలల తరబడి పనులు నడుస్తుండడంతో రహదారి దాటేందుకు ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు.
దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిరంతరం కొనసాగుతుండడంతో రోడ్డు దాటే సమయంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు రహదారి దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల మధ్య నుండి రోడ్డు దాటాల్సిన పరిస్థితి నెలకొనడంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని రహదారి దాటాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేనియెడల పనులు పూర్తయ్యే వరకు ప్రజల కోసం తాత్కాలికంగా సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలో ప్రజల రద్దీతో పాటు వాహనాల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. పండుగ సమయంలో రహదారి దాటే ప్రజల సంఖ్య పెరిగితే ప్రస్తుత పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హైవే విస్తరణ పనులను వేగవంతం చేయడంతో పాటు, అండర్పాస్ వంతెనపనులు పూర్తయ్యే వరకు ప్రజలకు సురక్షితమైన తాత్కాలిక క్రాసింగ్ మార్గాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చౌటుప్పల్లో నత్తనడకన అండర్ పాస్ వంతెన పనులు