కేసీఆర్ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయంతో రంది లేకుండా ఉన్న రైతుల పరిస్థితి రేవంత్ సర్కారు రాకతో తలకిందులైంది. సరిపడా అందని సాగునీళ్లు, కరెంటు కోతలు, పెట్టుబడికి ఇబ్బందులు, కొందరికే రుణమాఫీ, వడ్లకు బోనస్.. ఇలా ఏ ఒక్కటీ సరిగ్గా అందకపోవడంతో ఆగమవుతున్నది. పంట పండించడం ఒక్కటే తెలిసిన రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో రైతులు అన్ని దశల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమ అని చెప్పడమే తప్ప అమలుచేయకపోవడంతో ముందుకు సాగలేక పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు భారమై తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల బలవన్మరణాలపై అధ్యయనం చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ కదలివస్తోంది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో గురువారం వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడలో పర్యటించి భరోసా కల్పించనున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను సమగ్రంగా తెలుసుకోని రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నది.
– వరంగల్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో సర్కారు నుంచి రైతులకు అందాల్సినవి, హక్కుగా చెందాల్సినవీ ప్రస్తుతం ఒక్కటీ అమలు కావడం లేదు. సాగులో తలెత్తే ఇబ్బందులతో కొందరు రైతుల పరిస్థితి ఆగమవుతున్నది. సర్కారు అండ లేకపోవడంతో పంట పెట్టుబడి కోసం వ్యాపారుల దగ్గర తెచ్చిన అప్పు ప్రాణాలకు ముప్పు తెస్తున్నది. ప్రభుత్వం నుంచి భరోసా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. పంట పండించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు లేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ కదలివస్తున్నది. రైతు ఆత్మహత్యలు, వ్యవసాయరంగంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితులపై అధ్యయనం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలోని రైతులు, సాగు పరిస్థితులపై ఈ కమిటీ అధ్యయనం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, వ్యవసాయ కమిషన్‌కు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఈ కమిటీ నివేదికను అందించనున్నది.
సాగు అంతంతే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఒక సీజన్లో సగటున 14.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతులకు సర్కారు పరంగా అందించే పెటుబడి సాయం(రైతుబంధు)ను ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిగా నిలిపివేయడంతో సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. వానాకాలంలోనూ ఉమ్మడి జిల్లాలో 13 లక్షలకు మించి సాగు కావడం లేదు. పత్తి, మిరప, వరి పంటల సాగులో ఉమ్మడి వరంగల్ జిల్లా ముందుండేది. ప్రభుత్వ పరంగా సహకారం లేకపోవడంతో ఏడాదిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సాగులో ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు మళ్లీ వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల కోసం ప్రకటించిన పథకాలను కాంగ్రెస్ ప్రభత్వం అమలు చేయడం లేదు. రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సమయానికి ఎరువులు, నిరంతర కరెంట్, పంటల కొనుగోళ్లు, వడ్లకు కింటాకు రూ.500 బోనస్ మాటలకే పరిమితమయ్యాయి.
బోనస్ లేదు..
వరి పండించిన రైతులక ప్రోత్సాహకంగా వడ్లకు కింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వానాకాలం పంటకు అమలు చేస్తున్నట్లు చెప్పింది. పంట అమ్ముకున్న రైతులు బోనస్ కోసం నెలలుగా ఎదురుచూస్తున్నారు. వరి పంటలకు కనీస మద్దతు ధర కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. వానాకాలం, యాసంగి కలిపి ఏటా రూ.300 కోట్లతో లక్షన్నర మేరకు వ్యాపారం జరుగుతున్నది. సగటున 2.80 లక్షల మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్ముతున్నారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ అనే సాకు చూపి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మంది రైతులకు అన్యాయం చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సన్న వడ్లు పండించిన 52,186 మంది రైతులకు రావాల్సిన రూ.96 కోట్ల బోనస్ పెండింగ్‌లోనే ఉన్నది. ఈ బోనస్ ఎప్పటివరకు చెల్లిస్తారనేది ప్రభుత్వపరంగా, అధికారులలో ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. రైతుల ఆర్థిక ఇబ్బందులకు ఇదీ కారణమవుతున్నది.
రైతుభరోసా లేదు..
పంటల పెట్టుబడి ఖర్చుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసింది. ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతులకు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతు భరోసా అని పేరు మార్చి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. తర్వాత రూ.12 వేలకు తగ్గించింది. ఏడాదిగా పథకాన్ని పక్కనబెట్టింది. జనవరి 26 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. మండలంలోని ఒక గ్రామంలో మాత్రమే ఈ పథకం అమలవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలోని 8,77,173 మంది రైతులకు రైతుబంధు పథకం వర్తించేది. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.880 కోట్లు పెట్టుబడి సాయం కోసం రైతుల బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం జమచేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సాయం అందడం లేదు. ఉమ్మడి జిల్లాలో 1705 గ్రామలు ఉంటే ఇటీవల ప్రారంభించిన రైతు భరోసా కింద 71 గ్రామాల్లోని ఈ పథకం అమలవుతున్నది. 10శాతం మంది రైతులకు సైతం ఈ సాయం అందడం లేదు.
లక్షల్లో రుణమాఫీ బాధితులు..
కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది జూలై 18న లక్ష రూపాయల లోపు పంట రుణాలను, జూలై 31న లక్ష రూపాయల నుంచి ఒకటిన్నర లక్షల రూపాయల రుణాలను, ఆగస్టు 15న లక్షన్నర రూపాయల నుంచి 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించింది. నవంబర్ 30న రూ.2 లక్షల్లోపు రుణాలు నూటికి నూరు శాతం రద్దు చేశామని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు ఆ తర్వాత నిబంధనల పేరుతో మాట తప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు హామీ ఇచ్చిన పంట రుణాల మాఫీ పథకం అమలు అంతంత మాత్రంగానే ఉన్నది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పంట రుణాలు మాఫీ అయిన రైతుల సంఖ్య, మాఫీ అయిన మొత్తం వివరాలను వ్యవసాయ శాఖ ఇప్పటికీ ప్రకటించడం లేదు. కుటుంబ నిర్ధారణ నిబంధనతో సగం మంది రైతులకు పంట రుణాలు మాఫీ కాలేదు. ఉమ్మడి జిల్లాలో 48,297 కుటుంబాలకు గాను 36,279 కుటుంబాల నిర్ధారణ పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన వాటిలో 25శాతం వరకు కుటుంబాలు మిగిలిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2.70 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ కావాల్సి ఉండగా 40శాతానికి పైగా పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అరకొర రుణమాఫీతో రైతులకు ఆర్థిక కష్టాలు తొలగిపోవడం లేదు.