బయ్యారం : టీచర్ కావాలంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినిలు గురువారం రోడ్డెక్కి రహదారిపై ధర్నా చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో సోషల్ టీచర్ లేక పాఠాలు చెప్పడం లేదని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులమైన తాము సోషల్ పాఠాలు చెప్పకుంటే వంద శాతం ఉత్తీర్ణత ఎలా సాధించాలని ప్రశ్నించారు. అనేకసార్లు అధికారులకు విన్నవించిన సోషల్ టీచర్ ను నియమించడం లేదని తెలిపారు.
టీచర్ లేకపోవడం వల్ల తాము పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ డీఈవో స్పందించి సోషల్ టీచర్ ని నియమించాలని తెలిపారు. అయితే విద్యార్థులు ఆందోళన చేపడుతున్న సమయంలో అటుగా వెళుతున్న మాజీ జెడ్పి చైర్ పర్సన్ ఆంగోత్ బిందు .. విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి డీఈఓతో ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని తెలిపారు. టీచర్ నియామకాల కోసం కృషి చేస్తానని అవసరమైతే కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని విద్యార్థులకు భరోసా కల్పించారు.