కేజీబీవీలు, భవిత సెంటర్లలో బోధన బందయ్యింది. సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో జనగామ జిల్లాలో 15 రోజులుగా ఆయా పాఠశాలల్లో తరగతులు జరగడం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎమ్మార్సీ సిబ్బంది ఆందోళనలో పాల్గొనడంతో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. దీంతో సర్కారు స్కూళ్లలో బియ్యం సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్న భోజన బిల్లులు ఆగిపోయాయి. పాఠశాలల్లో ఎప్పుడు బోధన ప్రారంభమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
– జనగామ, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ)
ఇక్కడ కనిపిస్తున్న బాలుడి పేరు యాసారపు మహేందర్. స్వగ్రామం జనగామ మండలం చౌడారం గ్రామం. జిల్లా కేం ద్రంలోని భవిత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మెతో బడి బందై 15 రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. చదువు అటకెక్కడంతో వ్యవసాయ బావి వద్ద తాతతో కలిసి పొలం పను ల్లో నారు కట్టలు మోసే పనిలో నిమగ్నమయ్యాడు. ఇలా జిల్లాలో చాలా సూళ్లు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ సూళ్లు సరిగా తెరవక విద్యార్థులు చదువుకు దూరమై ఇంటి వద్దే ఉంటున్నారు.
కేంద్ర అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేయడం, వంట కార్మికులకు బిల్లుల చెల్లింపు కోసం వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు తాతాలిక సిబ్బందిని ఏర్పాటు చేసి వంట బిల్లులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా రు. ఇదే జరిగితే బిల్లుల చెల్లింపులో అక్రమాలు, ఆన్లైన్ అనుసంధానంలో ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం మొండివైఖరి వీడి ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి సమ్మె విరమించే ప్ర యత్నాలు చేయకుండా తాత్కాలిక సిబ్బందితో పనులు చేయిస్తే పెద్దఎత్తున నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది.
ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెతో జనగామ జిల్లాలోని కేజీబీవీలు, భవిత సెంటర్లు, పాఠశాలల్లో బోధనకు ఆటంకం ఏర్పడుతున్నది. మండలాల్లో విద్యావనరుల కేంద్రాలు మూతపడ్డాయి. జిల్లాలోని 12 మండలాల్లో 416 మంది సమగ్ర శిక్షలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎమ్మార్సీ సిబ్బంది సమ్మెలో ఉండడంతో పీఎం పోషణ్ సహా ట్రెజరీకి సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వంట కార్మికుల బిల్లులను తొలుత మండల విద్యాధికారి కార్యాలయాల్లో డే టా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ చేసి ట్రెజరీకి పంపించాలి. ప్రతి మండలంలో దాదాపుగా 50 నుంచి 150 వరకు వంట కార్మికుల అకౌంట్లలోకి బిల్లులు జమ చేయాల్సి ఉంటుంది.
అన్ని మండలాల్లో బిల్లు లు నిలిచిపోవడంతో మండల విద్యాధికారులు సతమతమవుతున్నారు. మధ్యాహ్న భోజన రైస్ ఇండెం ట్ ఆన్లైన్ చేసేవారు లేక సేవలన్నీ ఆగి పోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన బి య్యాన్ని మండల లెవల్స్టాక్ పాయింట్ నుంచి తీసుకొస్తారు. ఈక్రమంలో మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేసే సీఆర్పీ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. కానీ వీరంతా సమ్మెలో ఉండడంతో పాఠశాల లకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. ప్రతి రోజూ విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వివరాలను డీఈవో కార్యాలయానికి చేరవేయడంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు.