పాలకుర్తి, ఫిబ్రవరి 18 : భూమి విరాళంగా ఇచ్చిన దాత కుటుంబీకులు పాఠశాలకు తాళం వేయడంతో సుమారు 120 మంది విద్యార్థులు ఆరు రోజులుగా చెట్ల కింద చదువుకుంటున్న వైనం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. వావిలాలలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల కోసం 2007లో ఇదే గ్రామానికి చెందిన దొంగరి ఉపేందర్‌రావు తమ భూమిని విరాళంగా ఇచ్చాడు. దీనికి బదులు ఉపేందర్‌రావు కుటుంబానికి రెండు గుంటల స్థలం ఇస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు.
అనంతరం పరిణామాల్లో ఉపేందర్‌రావు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉపేందర్‌రావు సతీమణి దొంగరి శ్రీలత రెవెన్యూ అధికారులను కలిసి తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరగా పట్టించుకోకపోడంతో గత నెలలో పాఠశాలకు తాళం వేసింది. స్పందించిన రెవెన్యూ అధికారులు 320 గజాల ఇంటి స్థలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీలత ఆరు రోజుల క్రితం పాఠశాలకు తాళం వేసింది. తనకు కేటాయించిన స్థలంలో ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నది.
పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు చెట్ల కింద చదువుకుంటున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలకు తాళం వేసినా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి నర్సయ్యను వివరణ కోరగా దీనిపై కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.