మహబూబాబాద్ రూరల్, జనవరి 2 : మహబూబాబాద్ పట్టణ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులంలో సెల్‌ఫోన్ విషయంలో బుధవారం రాత్రి విద్యార్థులు ఘర్షణ పడ్డారు. మధ్యాహ్నం గురుకులంలో వాటర్ పోసేందుకు ఆటోలో వాటర్ మెన్ రాగా, క్యాన్లను లెక్కించేందుకు 9వ తరగతి విద్యార్థి రాజేందర్‌ను టీచర్లు అక్కడ ఉంచారు. నీళ్లలో పడుతుందని వాటర్‌మెన్ తన సెల్‌ఫోన్‌ను రాజేందర్‌కు ఇవ్వగా, 10వ తరగతి విద్యార్థి రేవంత్ వచ్చి ఫోన్ చేసుకుంటానని అడిగితే ఇవ్వలేదు. దీనిని మనసులో పెట్టుకున్న రేవంత్ అర్ధరాత్రి తన స్నేహితులతో కలిసి రాజేందర్‌ను కొట్టడంతో అతడు వ్యాయామ ఉపాధ్యాయుడికి చెప్పాడు.
రాజేందర్‌ను ఎందుకు కొట్టావని గురువారం వ్యాయామ ఉపాధ్యాయుడు రేవంత్‌ను కర్రతో కొట్టాడు. దీంతో అతడికి ఎర్రగా దద్దులు రావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి వ్యాయామ ఉపాధ్యాయుడితో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరిని పిలిపించి జరిగిన సంగతి చెప్పడంతో పేరెంట్స్ వెళ్లిపోయారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ రాజేశ్‌ను వివరణ కోరగా 9వ తరగతి విద్యార్థి రాజేందర్‌ను రేవంత్, అతడి స్నేహితులు కొట్టారని, ఈ విషయంపై టీచర్లతో విచారించి ఐదుగురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.