హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 22: కాలేజీలో అధ్యాపకులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు రోడ్డెక్కారు. హనుమకొండ జిల్లాలోని ములుగురోడ్ పెద్దమ్మగడ్డ కాకతీయ కెనాల్ వద్ద ఉన్న ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో ములుగురోడ్పై బైఠాయించి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలేజీకి వెంటనే అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ స్పందించి తమ సమస్యలు వెంటనే పరిష్కరించేవరకు ఆందోళన విరమించమని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏడాదిగా అధ్యాపకులు లేకపోవడం వలన తరగతులు జరగడంలేదని, తమ భవిష్యత్ ఎలా అని ప్రశ్నిస్తూ విద్యార్థులు ములుగురోడ్లో బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే అనుభవం గల అధ్యాపకులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళనతో ట్రాఫిక్ భారీగా స్తంభించపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు.