హనుమకొండ, నవంబర్ 20 : హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్రైవే ట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్ స్నేహా శబరీష్‌ను కలిసేందుకు వచ్చారు. కలెక్టర్ మీటింగ్‌లో ఉందని, అదనపు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేయాలని అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో తాము కలెక్టర్‌నే కలుస్తామని కలెక్టర్ చాంబర్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని బలవంతంగా వారిని తీసుకెళ్లే ప్రయత్నం చేసే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వారిని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు అక్రమంగా, దౌర్జన్యంగా కొడుతూ బలవంతంగా అరెస్ట్ చేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలను కాపాడడానికే కలెక్టర్ పోలీసులతో వామపక్ష విద్యార్థి సంఘాలపై దాడి చేయించిందని వారు ఆరోపించారు. విద్యారంగ సమస్యలపై ఇచ్చే వినతి పత్రాలు కలెక్టర్ తీసుకోకపోవడం అంటే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లేనన్నారు. తెలంగాణలో ప్రజా పాలన ఉందని సీఎం చెప్పడం బూటకంగా కనిపిస్తుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు విద్యార్థి సంఘాల పక్షమా, కలెక్టర్ పక్షమా తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో సమస్యలు చెప్పుకొనేందుకు స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు విద్యార్థి సంఘాల నాయకులను ఈడ్చి పడేస్తూ, కొడుతుంటే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోతే వారి కనుసన్నల్లో జరిగిందనే అనుకోవాల్సి వస్తుందని అన్నారు. సుబేదారి సీఐపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు గడ్డం నాగార్జున, మొగిలి వెంకట్‌రెడ్డి, భాషబోయిన సంతోష్, మంద శ్రీకాంత్, అఖిమ్ నబీద్, వీ నర్సింహారావు, తదితర నాయకులు పాల్గొన్నారు.