హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థి నేతలు భగ్గుమంటున్నారు. వర్సిటీలోని 400 ఎకరాలను కార్పొరేట్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలని.. భూముల పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జిలు, అక్రమ అరెస్టులు చేయడం దారుణమని మండిపడ్డారు. సోమవారం కేయూలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి ఎస్ఎఫ్ఐ నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అలాగే కేయూ-2 గేట్‌తో పాటు అదాలత్ జంక్షన్, ఆర్ట్స్‌కాలేజీ ఎదుట డీవైఎఫ్ఐ, పీడీఎస్‌యూ, డీఎస్ఏ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దహనం చేసి సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే భూముల వేలం ఆలోచన విరమించుకొని, విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
– హనుమకొండ/ హనుమకొండ చౌరస్తా, మార్చి 31
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ హెచ్చరించారు. కాకతీయ యూనివర్సిటీలో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మొదటి గేటు ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా కేయూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులకు, పోలీసుల వాగ్వాదంతో కేయూలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అలాగే హనుమకొండ అదాలత్ జంక్షన్ వద్ద పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో, కాకతీయ యూనివర్సిటీ రెండో గేట్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో, ఆర్ట్స్‌కాలేజీ ఎదుట డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్(డీఎస్ఏ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను వేలం వేసి ఇతర ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారని, విద్యార్థులు భూములు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జి చేయిస్తూ వారిని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలనా? లేక ప్రైవేట్ కార్పొరేట్ పాలనా? అని వారు ప్రశ్నించారు. ఓ వైపు దికు రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను ధ్వంసం చేస్తుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీలను నాశనం చేసేవిధంగా ఆలోచన చేస్తుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న ప్రజల రైతుల సమస్యలను పరిషరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు.
ప్రభుత్వ యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేయాలని, ఇలాంటివి చేయకుండా ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు రేవంత్‌రెడ్డి దోచిపెడుతున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన మానుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి ఆ భూముల జోలికి వెళ్లకుండా ఉండాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో జిల్లా కేంద్రాలలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కన్నారావు, రాహుల్, అఖిల్, శీను, రాజ్‌కుమార్, కల్యాణ్‌రామ్ పాల్గొన్నారు. యూనివర్సిటీ భూములను అమ్మే ఆలోచనను తక్షణమే విరమించుకొని అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేసి వారిపై మోపిన కేసులను ఎత్తివేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేశ్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డీ తిరుపతి, డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ శ్రావణ్, కో కన్వీనర్ ఎం గణేశ్ డిమాండ్ చేశారు.