వాజేడు, ఫిబ్రవరి 16 : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఆశ్రమ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న సోయం వినీత్(13) శనివారం రాత్రి మృతి చెందగా, హాస్టల్ వార్డెన్, హెచ్ఎం నిర్లక్ష్యమే కారణమని ఆదివారం కుటుంబసభ్యులు ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి.. పేరూరు గ్రామానికి చెందిన వినీత్‌కు జ్వరం రావడంతో శుక్రవారం ఇంటికి వచ్చాడు. శనివారం వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు ధర్మవరం గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స చేయించి, ఇంటికి తీసుకొచ్చారు.
రాత్రి వరకు తగ్గకపోగా, మళ్లీ ఆరో గ్య పరిస్థితి విషమించడంతో ఆర్ఎంపీ సూచన మేరకు ఏటూరునాగారం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా హాస్టల్ నిర్వాహకులు తమకు తెలియజేయలేదని, ట్యాబ్లెట్ మాత్రమే వేయించి, పరిస్థితి చేయిదాటాక ఇంటికి పంపించారని వినీత్ కుటుంబసభ్యులు ఆరోపించారు.
అధికారులు ఎవరూ ఘటనా స్థలం వద్దకు రాకుండా ఏటీడీఏ స్థాయి అధికారితో ఫోన్లో మాట్లాడించడంతో మృతుడి బంధువులు, ఏఎన్ఎస్, ఏఎస్పీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎం, వార్డెన్లు కుటుంబానికి న్యాయం చేసేలా అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా మంత్రి సీతక్క విద్యార్థి కుటుంబ సభ్యులను ఫోన్లోనైనా పరామర్శించలేదని ఆదివాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నరసింహమూర్తి విమర్శించారు. ఐటిడీఏ అధికారులు విద్యార్థి మృతిపై విచారణ జరిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు ఉయిక శంకర్ పాల్గొన్నారు.