దేవరుప్పుల, నవంబర్ 14 : బాలల దినోత్సవం వేళ సంబురంగా వేడుకల్లో పాల్గొనాలని పాఠశా లకు బయలుదేరిన బాలికను దారిలోనే మృత్యువు కబళించింది. మండలంలోని రాంబోజీగూడెం గ్రామానికి చెందిన రైతు నక్కిరెడ్డి కృష్ణారెడ్డి-మౌనిక రెండో కూతురు పూజ(14) చినమడూరు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. ప్రతి రోజూ సైకిల్‌పై రెండు వాగులు దాటి 3 కిలోమీటర్ల దూరం ఉన్న పాఠశాలకు పోవాల్సిందే.
శక్రవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన పూజ పెద్దవాగు దాటి చిన్న వాగులో సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇసుక ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. పూజకు బలమైన గాయాలు తగలడంతో అపస్మారక స్థితికి వెళ్లింది. ఈ విషయం తెలిసిన ట్రాక్టర్ ఓనర్ మైదం జోగేశ్వర్ తన కారులో పూజను జనగామ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ గుర్రం కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సృజన్‌కుమార్ తెలిపారు.