ములుగు, ఆగస్టు10(నమస్తేతెలంగాణ); దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించి అనేక రాయితీలు కల్పించడంతో వేలాది ఎకరాల్లో రైతులు పంట సాగు చేయగా, కొన్ని ప్రాంతాల్లో దిగుబడి మొదలైంది. అయితే పంట మారెటింగ్, ఆయిల్ పామ్ గెలల విక్రయాలపై పలు అనుమానాలుండగా క్షేత్రస్థాయిలోనే కంపెనీలు కొనుగోలుచేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ములుగు జిల్లా ఇంచర్ల శివారులో ప్రైవేట్ కంపెనీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 12 ఎకరాల భూమిని కేటాయించగా, సోమవారం మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయిల్ పామ్ పండించే రైతుల కల సాకారం కానుంది.
వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంటను పం డించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో రైతులకు గత ప్రభుత్వం అవగాహన కల్పించింది. దీంతో ములుగు జిల్లాలో మూడువేల ఎకరాలు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో 20 నుంచి 30వేల ఎకరాల్లో నాలుగేళ్ల క్రి తం ఈ పంట సాగును రైతులు చేపట్టారు. ప్రస్తుతం పంట చేతికి వస్తున్న సమయంలో చెట్ల నుండి గెలలను నిర్ణీత సమయంలో ఫ్యాక్టరీకి తరలించి ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా రైతులు ఖమ్మం జిల్లాకు గాని, ఇతర ప్రాంతాలకు గాని ఆయిల్ పా మ్ గెలలను తరలించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో ప్ర యాణ భారంతో పాటు రవాణా ఖర్చులకు రైతులు ఇబ్బందులు పడే వారు.
కొన్ని ప్రాంతాల్లో పంటను కొనసాగించాలా..? వద్దా..? అనే డోలాయమానంలో పడ్డారు. రైతు ల ఆందోళన తెలుసుకున్న ప్రభుత్వం జూన్‌లో జరిగిన మం త్రి వర్గ సమావేశంలో ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. వెనకబడిన ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు కానుండడంతో ములుగు ప్రాంతం పారిశ్రామికంగా ప్రత్యేక గుర్తింపు పొం దనున్నది. దీంతో స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులతోపాటు ఇతర వర్గాలకు ప్రయోజనాలు కలుగనున్నాయి. వాణిజ్య పంటగా పేరు పొందిన ఆయిల్‌పామ్ ద్వారా భవిష్యత్‌లో ఎగుమతి దిగుమతి పన్నులు ఇతరత్రా రూపాల్లో జిల్లా ఖజానాకు లబ్ధి చేకూరనున్నది.
నేడు మంత్రులతో ప్రారంభం
ములుగు ప్రాంతంలో కేఎన్ బయోసైన్స్ కంపెనీకి ఇంచర్ల శివారులో సర్వే నంబర్ 25 , 28లలో 12 ఎకరాల భూమిని ఎకరాన రూ. 26,70, 000 చొప్పున ధర ఖరారు చేసి డబ్బులు కట్టించుకొని భూమిని అప్పగించింది. కంపెనీ యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకోగా సోమవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక శంకుస్థాపన చేయనున్నారు.
ఏడాది కాలంలో పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా ఆయిల్ పామ్ గెలలను కొనుగోలు చేసేందుకు కంపెనీ యాజమాన్యం సమాయత్తమవుతున్నది. కొనుగోలు చేసిన గెలల నుంచి పామాయిల్ నూనెను ఉత్పత్తి చేసి దేశ విదేశాలకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అనుకున్న మేర ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తయి పామాయిల్ వంట నూనె ఉత్పత్తి అయినట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆయిల్ పామ్ పంట సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరనున్నది. అదేవిధంగా ఈ పంట సాగు చేసే వారి సంఖ్య కూడా పెరుగనున్నది. మొత్తానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగుపై తీసుకున్న నిర్ణయాలు ఒకొకటిగా ఫలితాలను ఇస్తున్నాయి.