పలిమెల, నవంబర్ 6 : భారీ సుడిగాలితో ధ్వంసమైన పంటల రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. గురువారం జిల్లా అటవీ శాఖాధికారి నవీన్‌రెడ్డితో కలిసి పలిమెల మండలంలోని లెంకలగడ్డ శివారు అటవీ ప్రాంతంలో దెబ్బతిన్న పంటలు, నేలవాలిన వృక్షాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుడిగాలి ప్రభావానికి అడవిలో చెట్లు కూలిపోగా, 30 నుంచి 40 ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంటలు ధ్వంసమయ్యాయన్నారు. ప్రాథమికంగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలివ్వాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఆదేశించారు.
దాన్ని ప్రభుత్వానికి పంపించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేరొన్నారు. అనంతరం వాహనం వెళ్లడానికి అవకాశం లేకపోగా మోటర్ సైకిల్‌పై అటవీ శాఖ అధికారులతో కలిసి వెళ్లి నేలకొరిగిన వృక్షాలను పరిశీలించారు. అటవీ ప్రాంతంలో విరిగిన చెట్లను లెకించి నివేదిక అందించాలని సూచించారు. చెట్లు నేలకొరిగిన చోట నూతన ప్లాంటేషన్ చేపట్టి అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి సునీల్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, తహసీల్దార్ అనిల్, ఎంపీడీవో సాయిపవన్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.